Karnataka: ఎన్నికల వేళ కర్ణాటకలో సంచలనం.. బోనీ కపూర్ కారులో భారీగా వెండి వస్తువులు సీజ్..!

ప్రముఖ బాలీవుడ్ సినీ నిర్మాత బోనీ కపూర్‌కు చెందిన కారులో వెండి వస్తువులు దొరికాయి. కర్ణాటక, దావణగెరె పరిధిలోని ఒక టోల్ గేట్ సమీపంలో శనివారం పోలీసులు, ఎన్నికల అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో అటుగా వెళ్తున్న ఒక బీఎండబ్ల్యూ కారులో భారీగా వెండి వస్తువులు లభించాయి.

  • Written By:
  • Updated On - April 8, 2023 / 07:23 PM IST

Karnataka: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేడి ఊపందుకుంది. ఒక పక్క రాజకీయ పార్టీల ర్యాలీలు, సభలు, హామీలు.. మరోపక్క పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఒక సినీ నిర్మాత కారులో వెండి వస్తువులు దొరకడం సంచలనంగా మారింది. ప్రముఖ బాలీవుడ్ సినీ నిర్మాత బోనీ కపూర్‌కు చెందిన కారులో వెండి వస్తువులు దొరికాయి. కర్ణాటక, దావణగెరె పరిధిలోని ఒక టోల్ గేట్ సమీపంలో శనివారం పోలీసులు, ఎన్నికల అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో అటుగా వెళ్తున్న ఒక బీఎండబ్ల్యూ కారులో భారీగా వెండి వస్తువులు లభించాయి. ఐదు బాక్సుల్లో లభ్యమైన వీటిని చెన్నై నుంచి ముంబై తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీటికి సంబంధించిన సరైన పత్రాలు లేని కారణంగా అధికారులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమలవుతోంది.
66 కేజీల వెండి గిన్నెలు
అధికారులు స్వాధీనం చేసుకున్న వెండి విలువ దాదాపు రూ.39 లక్షలుపైనే ఉంటుందని అంచనా. దాదాపు 66 కేజీల వెండి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇందులో వెండి గిన్నెలు, స్పూన్లు, ప్లేట్లు, ఇతర సామగ్రి ఉన్నాయి. ఈ వస్తువులు దొరికిన కారు బోనీ కపూర్‌దే అయినప్పటికీ, ఆ సమయంలో ఆయన అందులో లేరు. కారు డ్రైవర్ సుల్తాన్ ఖాన్, మరో సహాయకుడు హరి సింగ్ మాత్రమే అందులో ఉన్నారు. ఈ కారు బోనీ కపూర్‌కు చెందిన నిర్మాణ సంస్థ బే వ్యూ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రిజిష్టర్ అయి ఉంది. ఈ అంశంపై అధికారులు ఆరా తీశారు. ఆ వెండి వస్తువులు బోనీ కపూర్‌కు చెందినవే అని హరి సింగ్ చెప్పాడు. అతడి వాంగ్మూలం నమోదు చేసుకున్న అధికారులు దీనిపై ఆరా తీస్తున్నారు. అవి నిజంగా బోనీ కపూర్‌వేనా.. లేక ఎన్నికల్లో పంచేందుకు తెచ్చినవా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఎన్నికల కోడ్ నేపథ్యంలో
ఇప్పటికే కర్ణాటకలో ఎన్నికల కోడ్ అమలవుతున్న నేపథ్యంలో అధికారులు భారీ స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో డబ్బు, వస్తువులు పంచి ఓటర్లను ఆకర్షించే అవకాశం ఉన్నందువల్ల వీటిని అడ్డుకునేందుకు చర్యలు ప్రారంభించారు. ఈ అంశంపై ప్రధానంగా దృష్టి సారించిన ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకుంటోంది.