cyber crime: సైబర్ నేరాలకు పాల్పడే మొబైల్ నెంబర్ల శాశ్వత బ్లాక్.. నేరాలకు అడ్డుకట్టపడేనా?

సైబర్ నేరాలకు పాల్పడే అనుమానిత నెంబర్లను శాశ్వతంగా బ్లాక్ చేయడం. ఇప్పటికే ఇలాంటి నెంబర్లను అనేకం బ్లాక్ చేసింది తెలంగాణ పోలీసు విభాగం. సైబర్ నేరాల్ని అరికట్టేందుకు అన్ని రకాల నివారణా మార్గాల్ని అన్వేషిస్తున్నట్లు పోలీసు శాఖ తెలిపింది.

  • Written By:
  • Publish Date - June 9, 2023 / 09:45 AM IST

cyber crime: సైబర్ నేరాలకు కారణమవుతున్న వాటిలో మొబైల్ నెంబర్లే చాలా కీలకం. ఫేక్ డాక్యుమెంట్స్‌తో మొబైల్ నెంబర్లు తీసుకుని, వాటి ద్వారా కాల్స్ చేస్తూ కొందరు కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. అయితే, ఇలాంటివాటిని గుర్తించి అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ పోలీసు విభాగం కొత్త పద్ధతిని అనుసరించబోతుంది.

అదే.. సైబర్ నేరాలకు పాల్పడే అనుమానిత నెంబర్లను శాశ్వతంగా బ్లాక్ చేయడం. ఇప్పటికే ఇలాంటి నెంబర్లను అనేకం బ్లాక్ చేసింది తెలంగాణ పోలీసు విభాగం. సైబర్ నేరాల్ని అరికట్టేందుకు అన్ని రకాల నివారణా మార్గాల్ని అన్వేషిస్తున్నట్లు పోలీసు శాఖ తెలిపింది. దీనిలో భాగంగా చేపట్టిన ఫోన్ నెంబర్ల శాశ్వత బ్లాకింగ్ విధానం మంచి ఫలితాన్నిచ్చిందని పోలీసులు చెప్పారు. నాలుగేళ్లలో సైబర్ నేరాలు ఆరు రెట్లు పెరిగాయి. 2019లో 2,691 నేరాలు నమోదు కాగా.. 2022 నాటికి అవి 15,217కు చేరుకున్నాయి.

అంటే నాలుగేళ్లలో ఏ స్థాయిలో పెరిగాయో అర్థం చేసుకోవచ్చు. వీటిలో 90 శాతం వరకు ఆర్థిక నేరాలే ఉన్నాయి. మన దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా కొందరు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఎప్పటికప్పుడు సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతులు అనుసరిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. పోలీసులకు చిక్కకుండా ప్రజల జేబులు ఖాళీ చేస్తున్నారు. ఈ మోసాలపై విచారణ జరిపితే ఈ మోసాలకు, సెల్ ఫోన్లకు ఏదో ఒక రూపంలో లింక్ ఉందని అర్థమవుతోంది.

ఫోన్ చేసి మాట్లాడి బురిడీ కొట్టించడం, ఎస్ఎంఎస్ పంపడం వంటి చర్యల ద్వారా నేరాలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే సిమ్ కార్డుల అమ్మకాలన్ని కఠినతరం చేశారు. దీనిద్వారా సిమ్ కార్డులు దుర్వినియోగం కాకుండా ఉంటాయి. సిమ్ కార్డులను బ్లాక్ చేయడం ద్వారా నేరాలు తగ్గుతున్నాయని పోలీసులు అంటున్నారు.