Female Teachers: ఏ వృత్తిలో ఎవరికీ దక్కని గౌరవం టీచర్లకు దక్కుతుంది. ఎందుకంటే ఉన్నతమైన భావి సమాజాన్ని నిర్మించాల్సింది వాళ్లే కాబట్టి. వారి చర్యలు, పాఠాల ద్వారానే విద్యార్థులు స్ఫూర్తి పొంది, మంచి వ్యక్తిత్వాన్ని ఏర్పర్చుకుంటారు. అంతలా స్ఫూర్తిగా నిలవాల్సిన టీచర్లే దారి తప్పి నీచంగా ప్రవర్తించిన ఘటనలు అమెరికాలో జరిగాయి. మహిళా టీచర్లు విద్యార్థులతో లైంగిక చర్యలకు పాల్పడ్డ దారుణ ఘటనలు అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో వెలుగు చూశాయి. ఈ ఘటనలకు సంబంధించి కేసులు నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకు ఆరుగురు మహిళా టీచర్లను అరెస్టు చేశారు.
క్యాలిఫోర్నియాలోని డానివిల్లే అనే సిటీకి చెందిన ఒక టీచర్ ఈ ఘటనలో అరెస్టైంది. స్థానిక పాఠశాలలో పని చేస్తున్న ఎలెన్ షెల్ అనే టీచర్ పదహారేళ్ల ఇద్దరు యువకులతో అనేకసార్లు లైంగిక చర్యకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆమెపై థర్డ్ డిగ్రీ అత్యాచారం కింద కేసు నమోదు చేసిన పోలీసులు స్థానిక గరార్డ్ కౌంటీ కోర్టులో హాజరు పరిచారు. విచారణ కొనసాగుతోంది. ఒక్లహామాకు చెందిన ఎమిలీ హాన్‌కాక్ అనే టీచర్ కూడా ఆమె పని చేసే పాఠశాలకు చెందిన ఒక విద్యార్థితో సాన్నిహిత్యంగా ఉంటున్నట్లు గుర్తించారు. దీంతో ఆమెను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఆర్కన్సాస్ రాష్ట్రానికి చెందిన హెథర్ హరే అనే మహిళా టీచర్‌పై కూడా లైంగిక దాడి ఆరోపణలొచ్చాయి. ఆమె ఒక టీనేజ్ విద్యార్థితో సంబంధం కలిగి ఉన్నట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు ఆమెపైనా చర్య తీసుకున్నారు.
అయోవా రాష్ట్రానికి చెందిన దేస్ మెయిన్స్ పట్టణంలో ఉన్న ఒక హైస్కూల్‌లో క్రిస్టెన్ గ్యాంట్ అనే ఇంగ్లీష్ టీచర్ కూడా అదే స్కూల్‌కు చెందిన ఒక టీనేజ్ విద్యార్థితో లైంగిక సంబంధం కలిగి ఉందని ఆరోపణలొచ్చాయి. ఆమె చర్యలకు సంబంధించిన కొన్ని దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో కూడా రికార్డయ్యాయి. వీటి ఆధారంగా ఆమెపై కూడా పోలీసులు చర్యలు తీసుకుని అరెస్టు చేశారు. లిన్‌కాల్న్ అనే కౌంటీలోని ఒక స్కూల్‌లో పని చేస్తున్న ఎమ్మా డిలానే అనే కాంట్రాక్ట్ టీచర్ అక్కడి పదిహేనేళ్ల విద్యార్థితో లైంగిక సంబంధం కలిగి ఉంది.
సోషల్ మీడియాలో కూడా ఆమె తన బంధాన్ని కొనసాగించింది. ఈ విషయం బయటపడటంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. వర్జీనియాలో కూడా ఒక మహిళా టీచర్ కొంతకాలంగా విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. పెన్సిల్వేనియాకు చెందిన ఒక జావెలిన్ కోచ్‌తోపాటు మరికొన్ని చోట్ల కూడా ఇలా విద్యార్థులతో లైంగిక చర్యలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్టు చేస్తున్నారు. రెండు రోజుల్లోనే ఇలాంటి ఘటనలకు సంబంధించి ఆరు కేసులు నమోదయ్యాయి. పాఠాలు చెప్పాల్సిన టీచర్లు ఇలా ప్రవర్తిస్తుండటంపై పేరెంట్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యలకు తావు లేకండా స్కూల్ యాజమాన్యాలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.