Hyderabad: నీలోఫర్ హాస్పిటల్‌లో కిడ్నాప్‌కు గురైన ఆరు నెలల చిన్నారి ఫైసల్ కథ సుఖాంతమైంది. చిన్నారిని కిడ్నాప్ చేసిన మహిళను అదుపులోకి తీసుకుని ఫైసల్‌ను తన తల్లి ఫరిదాకు అప్పగించారు పోలీసులు. కానీ నిందితురాలు చిన్నారిని కిడ్నాప్ చేయడానికి గల కారణం విని పోలీసులే కన్నీళ్లు పెట్టుకున్నారు. చిన్నారిని కిడ్నాప్ చేసిన నిందితురాలి పేరు మమత. ఆమెకు, తన భర్తకు ఉన్న జెనటిక్ లోపం కారణంగా వీళ్లకు పుట్టిన పిల్లలు చనిపోతున్నారు.
ఇప్పటికే ఇద్దరు బిడ్డలను కోల్పోయింది మమత. 15 రోజుల క్రితం జన్మించిన మరో బిడ్డకు కూడా ముక్కు నుంచి రక్తం వస్తుండతంతో హాస్పిటల్‌కు తీసుకువచ్చింది మమత. ఆ బిడ్డ కూడా బతకడని డాక్టర్లు చెప్పడంతో బరువెక్కిన గుండెతో హాస్పిటల్ లాన్‌లోనే కూర్చుండిపోయింది. అదే టైంలో హాస్పిటల్‌కు వచ్చిన ఫైసల్ తల్లి ఫరీదా బేగం.. కాసేపు తన కొడుకును చూసుకోవాల్సిందిగా మమతను కోరింది. బిడ్డ దక్కడు అన్న బాధ మమతతో తప్పు చేయించింది. వెంటనే తన భర్త శ్రీనివాస్‌తో కలిసి ఫైసల్‌ను తీసుకుని పారిపోయింది మమత. కానీ సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితురాలిని గుర్తించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు బాన్సువాడలో మమతను అరెస్ట్ చేశారు. ఫైసల్‌ను తన తల్లికి అప్పగించారు.
నీలోఫర్ హాస్పిటల్ నుంచి జూబ్లీ బస్ స్టాండ్ వరకు పోలీసులు 100 కెమెరాలు జల్లెడ పట్టి నిందితులను గుర్తించారు. టెక్నాలజీ ఉపయోగించి నిందితుల ఫోన్ లోకేషన్ ఆధారంగా లోకేషన్‌ను గుర్తించారు. బాబును పెంచుకుందామనే ఉద్దేశంతోనే ఇలా చేసినట్లు పోలీసులకు తెలిపింది.