NIZAMABAD: నమ్మిన స్నేహితుడిని, అతడి కుటుంబాన్ని హతమార్చాడో దుర్మార్గుడు. ఆస్తి కోసం స్నేహతుడితోపాటు కుటుంంబ సభ్యుల్ని చంపిన ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి పరిధిలో జరిగింది. డిసెంబర్ 9 నుంచి వారం రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని చంపాడు ప్రశాంత్ అనే వ్యక్తి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజమాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం మాక్లూర్‌కు చెందిన ప్రసాద్ స్వగ్రామాన్ని వదిలి కుటుంబంతో కలిసి మాచారెడ్డిలో స్థిరపడ్డాడు.
ప్రసాద్‌కు భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. కొంతకాలంగా ప్రసాద్ అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. దీంతో తనకు మక్లూర్‌లో ఉన్న ఇంటిపై రుణం తీసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో ఆ ఇంటిపై ప్రసాద్ స్నేహితుడు ప్రశాంత్ కన్నేశాడు. ఆ ఇంటిని చేజిక్కించుకోవాలి అనుకున్నాడు. దీనిలో భాగంగా అప్పు తీర్చుకునేందుకు లోన్ ఇప్పిస్తానని, అంతవరకు ఇల్లు తన పేరున రాయాలని ప్రసాద్‌ను అడిగాడు ప్రశాంత్. దీంతో ప్రసాద్.. తన ఇంటిని ప్రశాంత్‌కు రాసిచ్చాడు. అయితే, ఎంతకీ లోన్ రాలేదు. దీంతో తాను రాసిచ్చిన ఇంటిని తిరిగి తనకే ఇచ్చేయాలని ప్రసాద్.. ప్రశాంత్‌పై ఒత్తిడి తెచ్చాడు. దీంతో తనకు ఇల్లు దక్కదేమో అనే ఉద్దేశంతో ప్రసాద్‌ను, అతడి కుటుంబాన్ని హత్య చేయాలనుకున్నాడు. ఎలాగో ఇల్లు తనపేరు మీద రాసిచ్చాడు కాబట్టి.. ఆ కుటుంబం హతమైతే, ఇక తనకు అడ్డు ఉండదు అనుకున్నాడు. ముందుగా ప్రసాద్‌ను ప్రశాంత్ హత్య చేశాడు. డిచ్‌పల్లి వద్ద హైవే పక్కన ఎవరికి అనుమానం రాకుండా ప్రసాద్ మృతదేహాన్ని పూడ్చి పెట్టాడు. తర్వాత ప్రసాద్‌ను పోలీసులు తీసుకెళ్లారని చెప్పి నమ్మించి అతడి భార్య రమణిని తీసుకెళ్లి బాసర వద్ద గోదావరిలో పడేశాడు ప్రశాంత్.
ప్రసాద్ దంపతులకు ఇద్దరు కవల పిల్లలున్నారు. ప్రసాద్ భార్యను చంపిన తర్వాత వారి కవల పిల్లలకు మాయ మాటలు చెప్పి వాళ్లను హతమార్చాడు. తర్వాత ప్రసాద్ చెల్లెళ్లను కూడా అలాగే నమ్మించి హత్య చేశాడు. మొత్తంగా ప్రసాద్, అతడి భార్య, ఇద్దరు కవలలు, ఇద్దరు చెల్లెళ్లను ప్రశాంత్ హత్య చేశాడు. ఇందులో మొదటి మూడు హత్యలు ప్రశాంత్ ఒక్కడే చేయగా, తరువాత మిగతా ముగ్గుర్ని మరో ముగ్గురు స్నేహితులతో కలిసి హత్య చేశాడు. ఘటనపై విచారణ జరిపిన పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పూర్తి వివరాలు సేకరించిన అనంతరం.. పోలీసులు నిందితుల్ని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.