Sri Chaitanya: శ్రీచైతన్య కాలేజీల అధినేత కన్నుమూత..

శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ బొప్పన సత్యనారాయణరావు అలియాస్ బీఎస్‌ రావు కన్నుమూశారు. ఆయన ప్రమాదవశాత్తు బాత్రూంలో జారిపడ్డారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బీఎస్ రావును ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది.

  • Written By:
  • Publish Date - July 13, 2023 / 05:15 PM IST

Sri Chaitanya: శ్రీచైతన్య జూనియర్‌ కాలేజీలు అంటే ఓ బ్రాండ్. అలాంటి బ్రాండ్ క్రియేట్ చేసిన అధినేత ఇక లేరు. శ్రీచైతన్య విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ బొప్పన సత్యనారాయణరావు అలియాస్ బీఎస్‌ రావు కన్నుమూశారు. ఆయన ప్రమాదవశాత్తు బాత్రూంలో జారిపడ్డారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బీఎస్ రావును ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. ఆరోగ్యం మరింత విషమించి ప్రాణాలు విడిచారు.

కుటుంబ సభ్యులు ఆయన భౌతికకాయాన్ని విజయవాడకు తరలించనున్నారు. విజయవాడలోనే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 1986లో శ్రీచైతన్య విద్యాసంస్థలను ప్రారంభించి, అనతికాలంలోనే ఆ సంస్థలను అగ్రగామి పథంలో నడిపించారు బీఎస్‌ రావు. మొదట విజయవాడలో బాలికల జూనియర్ కళాశాలతో ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. అక్కడ్నించి అంచెలంచెలుగా ఎదిగి, తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్, ఎంసెట్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా శ్రీచైతన్యను ఉన్నత స్థానానికి చేర్చారు. 321 జూనియర్ కాలేజీలు, 322 టెక్నో స్కూళ్లు, 107 సీబీఎస్ఈ స్కూళ్లను బీఎస్‌ రావు స్థాపించారు. శ్రీచైతన్య విద్యాసంస్థల్లో దాదాపు 8.5 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.

ఇంగ్లండ్‌, ఇరాన్‌లో వైద్యులుగా సేవలందించిన బీఎస్‌రావు దంపతులు 1986లో విద్యాసంస్థల రంగంలోకి ఎంటర్ అయ్యారు. వారికి ఇద్దరు కుమార్తెలు. రావు ఇటీవలే బ్రెయిన్ సర్జరీ కూడా చేయించుకున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు.. బీఎస్ రావు మరణంపై ఘన నివాళి తెలిపారు.