మన మార్కులతో పక్కింటోడికి సంబంధమేంటి? మన రిజల్ట్స్ వస్తున్నాయంటే బంధువులు ఎందుకు ఫోన్లు మీద ఫోన్లు చేస్తున్నారు..? మనకి మార్కులు ఎక్కువస్తే వాళ్లకి డబ్బులేమైనా వస్తాయా? తక్కువ వస్తే వాళ్ల బంగారమైనా పోతుందా? అసలు మార్కులు మన కెరీర్‌కు కొలమానమే కానప్పుడు దీనిపై సమాజానికి ఎందుకంతా ఇంట్రెస్టూ! ఏమో.. ఇక్కడ తప్పు సమాజానిది కాదు… బంధువులదీ కాదు..! మరెవరిది? తల్లిదండ్రులది.!
మార్కుల వస్తే బిల్డప్‌లు వద్దు:
ఎవరికైనా తమ పిల్లలు మంచిగా చదువుతున్నా.. మంచి మార్కులు తెచ్చుకున్నా.. గేమ్స్‌లో రాణిస్తున్నా.. ఏదైనా కప్ కొట్టినా..ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినా.. నలుగురికి చెప్పుకోవాలనే ఆసక్తి ఉంటుంది. అది పేరెంటల్ టెండెన్సీ! ఇందులో ఏ మాత్రం తప్పు లేదు..! అయితే మన పిల్లల గురించి గొప్పగా చెప్పుకునే క్రమంలో ఇతరుల పిల్లలను తక్కువ చేసి మాట్లాడితేనే అసలు సమస్య మొదలవుతుంది. తోటి పిల్లలను తమ పిల్లలతో కంపేర్ చేసే పేరెంట్స్ ఎక్కువగా ఉంటారు. అలాంటివాళ్ల..తమ పిల్లలకు తక్కువ మార్కులొచ్చాయని.. వేరే పిల్లలకు ఎక్కువ మార్కులు వచ్చాయని.. వాళ్లని చూసి బుద్ధి తెచ్చికొండంటూ మందలిస్తుంటారు. ఇదిపైకి సాధారణంగానే కనిపిస్తున్నా..దీని కారణంగా బాధిత పిల్లలు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. వేరే వాళ్ల కంటే మేము తక్కువేమోనన్న భావనకు వచ్చేస్తారు.
రిజల్ట్స్ విషయంలో అతి వద్దు:
రిజల్ట్స్ విడుదలైన తర్వాత విద్యార్థుల ఆత్మహత్యలకు పాల్పడడం ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా కొనసాగింది. స్టూడెంట్స్ సూసైడ్స్‌కు కారణాలంటూ రకరకాల అభిప్రాయాలు వినిపిస్తుంటారు విశ్లేషకులు. తల్లిదండ్రుల గురించి పిల్లలు ఆలోచించలేదని..తల్లిదండ్రులు, టీచర్లు ఒత్తిడి చేశారని.. మార్కులు తక్కువ వచ్చాయని తిట్టారని.. అందుకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న వాదన అందరూ వినిపించేదే.! అయితే ఇక్కడ వీటన్నికంటే ముఖ్యమైన విషయం ఒకటుంటుంది. అదే పరువు..! పరువు కోసం కన్నపిల్లలనే చంపుకునే తల్లిదండ్రులున్న కాలమిది.అది ప్రేమ, పెళ్లి విషయంలో అందరూ అంగీకరించేదే..అయితే చాలామంది గుర్తించని పరువు హత్యలు ఈ విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రధాన కారణం.
సొసైటి ఏం అనుకుంటుందోనంటూ ఒక్కటే షంటింగ్:
మార్కులు తక్కువ వస్తే వాళ్లు ఏదో అనుకుంటారు.. వీళ్లు ఏదో అనుకుంటారు..నేను మా బంధువుల దగ్గర తలెత్తుకొని తిరగలేను..మా కొలిగ్స్ దగ్గర నీ మార్కులు ఎన్నంటే ఏమని చెప్పాలి? ఇదో టైప్ ఆఫ్ టార్చర్ పిల్లలకు. అసలు మన పిల్లల మార్కులు వేరే వాళ్లకి చెప్పుకోవడందేనికి? ఇది ముందు నుంచి అలవాటు చేసుకున్నది తల్లిదండ్రులే కదా? చిన్నతనంలో ఎక్కువ మార్కులొచ్చినప్పుడు.. అదేపనిగా చెప్పుకొని.. టెన్త్, ఇంటర్ లాంటి పబ్లిక్ పరీక్షల్లో తక్కువ మార్కులొచ్చినప్పుడు మిగిలిన వాళ్లు అడగకుండా పోతారా? దొరికిందే ఛాన్స్ కదా అని ఎత్తిపొడుస్తారు.!
ఈ బాధాలన్ని పిల్లల వరకు తీసుకొచ్చి.. ఆ కోపాన్నంతా తల్లిదండ్రులు పిల్లలపై చూపిస్తారు. నిజంగానే తమ వల్ల తల్లిదండ్రుల పరువు పోయిందని ఫీల్ అయ్యే పిల్లలు ఆ బాధ తట్టుకోలేక తనువు చాలిస్తున్నారు. ఇక్కడ పిల్లలకు తక్కువ మార్కులొచ్చాయన్న బాధ కంటే చుట్టూ ఉన్న సమాజం ఏం అనుకుంటుందోనన్న టెన్షనే తల్లిదండ్రుల్లో కనిపిస్తుంది. మార్కులను పరువుగా, సోసైటీలో స్టేటస్‌గా భావించే తల్లిదండ్రులున్నంతా కాలం విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగతూనే ఉంటాయి.