Singer Sai Chand: పాటకు నాట్యం తోడైంది.. కన్నీళ్లు పెట్టిస్తున్న సాయిచంద్‌ లవ్‌స్టోరీ..

నిన్నటి వరకూ పాటలతో ఉత్తేజపర్చిన కళాకారుడు ఇప్పుడు తమ మధ్య లేడు అనే విషయాన్ని తెలంగాణ కళాకారుల కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. సాయిచంద్‌ మృతదేహాన్ని చూసి ఆయన భార్య రజిని ఏడ్చిన తీరు ప్రతీ ఒక్కరి హృదయాలను ద్రవింపజేసింది.

  • Written By:
  • Publish Date - June 29, 2023 / 03:11 PM IST

Singer Sai Chand: గుండెపోటుతో చనిపోయిన సాయిచంద్‌ హఠాన్మరణం తెలంగాణ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. నిన్నటి వరకూ పాటలతో ఉత్తేజపర్చిన కళాకారుడు ఇప్పుడు తమ మధ్య లేడు అనే విషయాన్ని తెలంగాణ కళాకారుల కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. సాయిచంద్‌ మృతదేహాన్ని చూసి ఆయన భార్య రజిని ఏడ్చిన తీరు ప్రతీ ఒక్కరి హృదయాలను ద్రవింపజేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఇక తిరిగిరాడని తెలిసి ఆమె గుండెలు పగిలేలా ఏడ్చారు.

సాయిచంద్‌, రజినిది లవ్‌ మ్యారేజ్‌. 2002లో సాయిచంద్‌, రజిని మొదటిసారి కలిశారట. ఆవిడ క్లాసికల్‌ డాన్సర్‌. కూచిపూడిలో డిప్లొమా కూడా చేశారు. చాలా ప్రోగ్రాంలు ఇద్దరూ కలిసి చేశారట. ఆ క్రమంలోనే వాళ్ల మధ్య ప్రేమ చిగురించిందట. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమే. కానీ ఎవరు ముందు బయటపడతారా అని ఇద్దరూ ఎదురు చూశారట. కానీ రజిని కంటే ముందే సాయిచంద్‌ ఆమెకు ప్రపోజ్‌ చేశారట. ఒక్క క్షణం కూడా ఆలోచించుకుండా సాయిచంద్ ప్రేమను ఒప్పుకున్నారట రజిని. ఆ తరువాత దాదాపు 8 ఏళ్ల పాటు ఇద్దరూ ప్రేమలో ఉన్నారు. ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడటంతో తాను సాయిచంద్‌ను ప్రేమిస్తున్నట్టు ఇంట్లో చెప్పేశారట రజని. సాయిచంద్‌ అప్పటికే తెలంగాణ ఉద్యమంలో పేరున్న కళాకారుడు కావడంతో ఇంట్లో కూడా ఒప్పుకున్నారట.

ఇలా 2011 మే18న ఇద్దరూ పెళ్లి బంధంలో ఒక్కటయ్యారు. వీళ్లకు ఇద్దరు పిల్లలు. సాయిచంద్‌ రాసిన ప్రతీ పాట.. మొదట తన భార్య ముందే పాడేవాడట. ఏ తప్పులున్నా తన భార్య సరి చేసేదట. తెలంగాణ ఉద్యమంలో కూడా తాను పని చేస్తున్న టైంలో రజిని ఆయనకు అన్ని విధాలా సపోర్ట్‌గా ఉందట. జీవితంలో ఎదుగుతున్న టైంలో, రాజకీయాల్లో అడుగుపెట్టిన టైంలో.. ఇలా ప్రతీ విషయంలో భర్త అడుగులోనే అడుగేస్తూ వచ్చిందట. కుటుంబంతో సంతోషంగా ఉండే ఫ్రీ టైం దొరకకపోయినా తన భార్య తనతో ఎప్పుడూ గొడవ పడలేదని.. ప్రతీ విషయంలో అర్థం చేసుకుంటుందని సాయిచంద్‌ చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు. ప్రేమ నుంచి పెళ్లి వరకూ ఎలాంటి వివాదాలు లేకుండా సాగిన వాళ్ల జీవణ ప్రయాణం.. సాయిచంద్‌ మరణంతో విషాదంగా మారింది.