Navdeep: మాదాపూర్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరో నవదీప్‌కు షాక్ తగిలింది. తనను అరెస్టు చేయకుండా చూడాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. నిబంధనల ప్రకారం నవదీప్‌కు నోటీసులలిచ్చి, విచారణకు పిలవాలని సూచించింది.
మాదాపూర్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్ పోలీసులు ఇటీవల పలువురిని అరెస్టు చేశారు. డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన వారిలో నవదీప్ స్నేహితుడు రాంచంద్ కూడా ఉన్నాడు. అతడిచ్చిన సమాచారంతోపాటు, అతడి దగ్గరినుంచి సేకరించిన వివరాల ఆధారంగా నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు. రాంచంద్, నవదీప్ మధ్య వాట్సాప్ చాట్‌ను గుర్తించారు. దీంతో ఈ కేసులో నవదీప్‌ను పోలీసులు పిలిచి విచారించాలనుకున్నారు. అయితే, నవదీప్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు తనకు, ఈ కేసుతో సంబంధం లేదని నవదీప్ మీడియాకు వెల్లడించారు. ఇదే సమయంలో తనను ఈ కేసులో అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ నవదీప్ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రెండు రోజుల క్రితం ఈ కేసు విచారణకురాగా.. అప్పుడు నవదీప్‌ను అరెస్టు చేయకుండా తాత్కాలిక మినహాయింపు ఇచ్చింది. విచారణ వాయిదావేసింది. మరోవైపు నార్కోటిక్ పోలీసులు నవదీప్‌కు బెయిల్ ఇవ్వొద్దని హైకోర్టును కోరారు. అతడికి వ్యతిరేకంగా ఆధారాలున్నాయని, నవదీప్‌న విచారించేందుకు అనుమతించాలని కోరింది. పోలీసుల వాదనలతో ఏకీభవించిన కోర్టు.. నవదీప్ పిటిషన్ కొట్టివేసింది. 41ఏ కింద నోటీసులు ఇచ్చి, నవదీప్‌ను విచారించాలని ఆదేశించింది. పోలీసుల విచారణకు సహకరించాలని సూచించింది. నవదీప్ విచారణకు సహకరించకపోతే.. అరెస్టు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.
మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్‌తోపాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురి పేర్లు ఉన్నాయి. ఒక నిర్మాత, మోడల్ సహా పలువురి పేర్లను నార్కోటిక్ పోలీసులు నిందితుల జాబితాలో చేర్చారు. ఈ కేసులో నవదీప్‌ను ఏ29గా చేర్చారు. అతడు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు తరచుగా హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నారని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే 8 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అరెస్టైన వారిలో ఫిల్మ్ ఫైనాన్షియర్ వెంకటరమణారెడ్డితో పాటు డియర్ మేఘ చిత్ర దర్శకుడు అనుగు సుశాంత్ రెడ్డి, ముగ్గురు నైజీరియన్‌లు ఉన్నారు.