3కోట్ల గోల్డ్ ఎత్తుకెళ్లిన థార్‌ గ్యాంగ్‌.. పక్కా ప్లాన్‌తో పట్టుకున్న తెలంగాణ పోలీసులు..

  • Written By:
  • Publish Date - August 5, 2024 / 04:59 PM IST

థార్ గ్యాంగ్.. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాలను వణికించిన పేరు ఇది. ఇళ్లలోకి దూరడమే కాదు.. మూసి ఉన్న తలుపులు తట్టి మరీ… థార్ గ్యాంగ్ దోపిడీకి పాల్పడేది. మెరుపు వేగంతో దోపిడీ చేసి పారిపోవడంలో.. ఈ గ్యాంగ్‌కు పెట్టింది పేరు. పగటివేళ సామాన్యుల్లా రెక్కీ నిర్వహిస్తూ.. రాత్రుళ్లు దొంగతనాలు చేయడం థార్‌ ముఠా స్పెషాలిటీ. రెండు మూడు నెలల కింది వరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాలను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడిన గ్యాంగ్.. ఆ తర్వాత రూట్ మార్చింది. బస్సులను టార్గెట్‌ చేసింది. ఇలా సంగారెడ్డి జిల్లా చిరాగ్‌పల్లి కోహినూర్ దాబా దగ్గర.. జూలై 25న ఆగి ఉన్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో… 3కిలోల బంగారు నగలను ఎత్తుకెళ్లిందీ గ్యాంగ్‌. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. పక్కా ప్లాన్‌తో దొంగలను పట్టుకున్నారు. జాతీయ రహదారిపై వాహన తనిఖీలు చేస్తుండగా… థార్‌ గ్యాంగ్‌ సభ్యులు కారులో కనిపించారు. అనుమానం వచ్చి వెంటాడారు. ఇద్దరు తప్పించుకోగా.. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.

ఆ కారులో నుంచి ట్రావెల్స్ బస్సులో చోరీకి గురైన 3కోట్ల విలువైన.. బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లే ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులే లక్ష్యంగా.. రెక్కీ నిర్వహించి థార్ గ్యాంగ్‌ చోరీలకి పాల్పడుతోంది. ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో బంగారం పట్టుబడడం ఇదే మొదటిసారి. థార్ గ్యాంగ్ సభ్యుల ప్రతీ కదలికలపై ముందే నిఘా పెట్టి ఉంచని పోలీసులు.. ఆ ముఠా ఊపిరి ఆడకుండా చేశారు. చివరికి నడిరోడ్డు మీద పట్టుకున్నారు.