Tele Communication: ఒకే వ్యక్తికి 658 సిమ్ కార్డులు..  బండారం బయటపెట్టిన ఏఐ టెక్నాలజీ 

సాధారణంగా ఒక వ్యక్తికి రెండు సిమ్ కార్డ్స్ ఉండటం కామన్. మరి కొందరికి అయితే ఆఫీస్, రెసిడెంట్, పర్సనల్, సోషల్ పరంగా నాలుగు ఉంటాయి. ఇక అంతకు మించి సిమ్ కార్డ్స్ ఉంటే కొంత గమనించాల్సిన విషయమే. తాజాగా ఒకే వ్యక్తి ఫోటోతో దాదాపు 658 సిమ్ కార్డులు ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది.

  • Written By:
  • Publish Date - August 9, 2023 / 09:01 AM IST

విజయవాడలోని గుణదలలో ఒకే ఫోటో తో 658 సిమ్ కార్డులు జారీ అయినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ గుర్తించింది. ఈ మేరకు స్థానిక కమిషనర్ కాంతిరాణాకు డాట్ సంస్థ ఫిర్యాదు చేసింది. దీనపై సత్వరమే విచారణ చేపట్టాలని సూర్యారావుపేట పోలీసులకు కమిషనర్ ఆదేశాలు జారీచేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఓ నెట్వర్క్ సంస్థకు చెందిన 658 సిమ్ కార్డులను ఒకే ఫోటోతో ఉన్న వ్యక్తికి అమ్మినట్లు గుర్తించారు. కొనుగోలు చేసిన వ్యక్తి సత్యనారాయణపురానికి చెందిన పోలుకొండ నవీన్ గా ప్రాధమిక దర్యాప్తులో తేలింది. అలాగే అజిత్ సింగ్ నగర్, విస్సన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మరో 150 పైగా సిమ్ కార్డులు డూప్లికేట్ ప్రూఫ్ తో రిజిస్టర్ చేసినట్లు కనుగొన్నారు.

ఇంలాంటి సిమ్ కార్డ్ మోసాలను అడ్డుకట్ట వేసేందుకు టెలికమ్యూనికేషన్ శాఖ సాంకేతికతను అందిపుచ్చుకుంటుంది. ఏఐ టెక్నాలజీతో పనిచేసే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ ఫేసియల్‌ రికగ్నేషన్‌ పవర్డ్‌ సొల్యూషన్‌ ఫర్‌ టెలికాం సిమ్‌ సబ్‌స్క్రైబర్‌ వెరిఫికేషన్‌ అనే ఓ టూల్ సహాయంతో ఇలాంటి కీలకమైన విషయాలు బయటపడ్డాయి. ఇది ఒక రకమైన సాఫ్టవేర్ గా చెప్పాలి. ఇందులో చేయబడిన ప్రోగ్రాం సిమ్ కార్డ్ మోసాలను గుర్తిస్తుంది. అలాగే సంబంధిత నంబర్లను బ్లాక్ లిస్ట్లో ఉంచుతుంది. మనకు అందుబాటులో ఉంటే అన్ని టెలికాం ఆపరేటర్ల నుంచి సిమ్ కార్డ్ తీసుకున్న వారి డేటాను సేకరిస్తుంది. ఇలా సేకరించిన డేటాను ఫిల్టర్ చేసి ఒకే ఫోటోతో ఉన్న సిమ్ కార్డులను వేరు చేస్తుంది. ఇలా చేయడం వల్లే అత్యధికంగా సిమ్ కార్డులు తీసుకున్న వ్యక్తి బాగోతం బయటపడింది.

T.V.SRIKAR