Egypt Beach: విషాదంగా మారిన విహారం.. టైగర్ షార్క్ కు బలైన యువకుడు..

సొర చేప.. ఈ పేరు వినగానే హాలీవుడ్ సినిమావాళ్లు చూపించే దృశ్యాలు మన ఊహకు కనిపిస్తాయి. వాటిని పెద్దగా చూడని వారికి రాజమౌళి తెరకెక్కించిన ప్రభాస్ సినిమా ఛత్రపతిలో చూడవచ్చు. అతను ఏవిధంగా పోరాడి సొరపై గెలుస్తాడో. అయితే ఇక్కడ ఈ విషయాన్ని గుర్తుకు తెచ్చుకునేలా ఒక సంఘటన చోటుచేసుకుంది. అదే ఒక వ్యక్తి సముద్రంలో ఈదుకుంటూ వెళుతున్నాడు. అతనిని సొర అమాంతం మింగేసింది. వినేందుకు మీకే షాక్ గా ఉంటే చూసిన వాళ్ళ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగింది. ఎలా జరిగింది అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

  • Written By:
  • Publish Date - June 9, 2023 / 07:01 PM IST

రష్యాకు చెందిన 23 ఏళ్ల వ్లాదిమిర్ పోపోవ్ తన ప్రేయసితో కలిసి సరదాగా ఈజిప్ట్ ట్రిప్ కి వెళ్లాడు. హుర్ఘదా బీచ్ రిసార్ట్ లో స్టే చేశాడు. ఇతను ఉన్న రెస్టారెంట్ కి సమీపంలోనే ఎర్రసముద్రం ఉంది. అందులో సరదాగా తోటి పర్యాటకులతో పాటూ తన ప్రియురాలితో కలిసి ఈతకు సముద్రంలోకి దిగాడు. వినోదం కోసం నీటిలోనికి దిగి కొంత సేపు ఈత కొడుతూ జాలీగా ఎంజాయ్ చేశాడు. ఇంతలోనే అటుగా ఒక టైగర్ షార్క్ ఈ బీచ్ లోకి ప్రవేశించింది. అప్పటికే అక్కడ ఈతకు వచ్చిన పర్యాటకులు భయభ్రాంతులకు గురై కేకలు పెడుతూ పారిపోయారు.

ఈ విషయాన్ని అంతగా పట్టించుకోని ఈ యువకుడు అలాగే నీటిలో ఉన్నాడు. ఇంతలో అతనికి దగ్గరగా వచ్చిన సొర తన నోటికి కరుచుకొని అతడిని నమిలేసింది. అప్పుడు తన తండ్రిని రక్షించమని ఆర్థనాదాలు పెట్టాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆ టైగర్ షార్క్ ఆకలిమీద ఉన్నట్లుంది. యువకుడిని నమిలి మింగేసింది. ఈవిషయాన్ని అక్కడి టూరిజం సిబ్బందికి తెలియజేశారు. వెంటనే అప్రమత్తమైన ఈజిప్ట్ టూరిజం డిపార్ట్మెంట్ అధికారులు సంఘటనా స్థలికి చేరుకున్నారు. అప్పటికే వ్లాదిమిర్ పోపోవ్ ను షార్క్ నమిలి మింగేయడంతో అక్కడి నీరు మొత్తం ఎర్రగా మారిపోయింది. ఈ ప్రమాదంలో తన ప్రియురాలు ఒడ్డుకు చేరుకొని ప్రాణాలు కాపాడుకుంది. అయితే ఈ ఘటన చూసిన అక్కడ చుట్టుపక్కల వారు ఆశ్చర్యపోతూ భయానికి గరయ్యారు. దీనిని గమనించిన సిబ్బంది ఆ షార్క్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి సొర చేపను పట్టుకొని ల్యాబ్లో పరీక్షిస్తామని తెలిపారు. ఈ సంఘటన మొత్తాన్ని కొందరు వీడియో రూపంలో తమ ఫోన్లలో భద్రపరుచుకున్నారు. ఈ క్లిప్ ను తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేయగా ఈ టాపిక్ వైరల్గా మారింది.

ఈ విషాదంపై స్పందించిన రష్యా ఒక ప్రకటన విడుదల చేసింది. రష్యా నుంచి వెళ్లిన పర్యాటకులు ఎక్కడ పడితే అక్కడి నీటిలో దిగవద్దని హెచ్చరించింది. అలాగే నిషేధిత బీచ్ లలో ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించింది.

 

T.V.SRIKAR