Uttar Pradesh: ఇంట్లో ఎలుకలున్నాయా? పొరపాటున వాటిని చంపేస్తున్నారా? అయితే, జాగ్రత్త..! ఎందుకంటే.. పోలీసు కేసు ఎదుర్కోవాల్సి రావొచ్చు. అవును.. ఎలుకను చంపినందుకే మీపై కేసు నమోదైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏంటీ.. ఎలుకను చంపితేనే పోలీసు కేసా.. అని లైట్ తీసుకోకండి. ఎందుకంటే ఇప్పటికే ఒక వ్యక్తి మీద ఆల్రెడీ ఎలుకను చంపినందుకు పోలీసు కేసు నమోదైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిపై 30 పేజీల చార్జిషీటు కూడా దాఖలు చేశారు. ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది ఈ ఘటన. పబ్లిక్ షాకయ్యే ఘటన ఇది.
ఎలుక హత్య.. పోస్టుమార్టం.. చార్జిషీటు!
ఉత్తరప్రదేశ్, బదౌన్ పట్టణంలో పోలీసులు ఎలుకను చంపిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. బదౌన్‌కు చెందిన మనోజ్ కుమార్ అనే వ్యక్తి ఇటీవల ఒక ఎలుకను చంపాడు. ఎలుక నీళ్లలో పైకి తేలకుండా ఇటుకకు కట్టి, కాలువలో ముంచి, ఊపిరాడకుండా చేసి చంపాడు. అయితే, ఈ తతంగాన్ని జంతు హక్కుల కార్యకర్త అయిన వికేంద్రశర్మ తన వీడియోలో చిత్రీకరించాడు. ఎలుకను మనోజ్ కుమార్ అత్యంత దారుణంగా చంపాడని ఆరోపిస్తూ, వికేంద్రశర్మ అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఈ ఘటన జరుగుతున్న సమయంలో పాపం ఎలుకను కాపాడేందుకు వికేంద్రశర్మ చాలానే ప్రయత్నించాడు. కానీ, అది సాధ్యం కాలేదు. దీంతో ఈ ‘దారుణ’ హత్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎలుకకు పోస్టుమార్టం కూడా నిర్వహించారు. పోస్టుమార్టం నివేదికతోపాటు ఎలుకను చంపుతున్న దృశ్యాలకు సంబంధించి వీడియోలు, ఫొటోలు, మీడియా కథనాల ఆధారంగా 30 పేజీల చార్జిషీటు రూపొందించారు. సాధారణంగా ఇన్ని పేజీల చార్జిషీటు తీవ్రమైన నేరాల విషయంలోనే పోలీసులు దాఖలు చేస్తుంటారు.
అవాక్కవుతున్న జనం
ఈ కేసు గురించి తెలుసుకుని జనం అవాక్కవుతున్నారు. ఎలుకను చంపితే కేసు నమోదు చేయడమేంటని పోలీసుల్ని ప్రశ్నిస్తున్నారు. ఎలుకల్ని చంపితే కేసు పెట్టారు సరే. మరి.. దోమల్ని చంపితే కూడా కేసు పెడతారా అంటూ అడుగుతున్నారు. ఇలాంటి వాటికి కేసులు పెట్టి, అరెస్టు చేసుకుంటూ వెళ్తే జైళ్లు కూడా సరిపోవు అంటున్నారు. నిందితుడు మనోజ్ తండ్రి మధుర ప్రసాద్ కూడా దీన్ని తప్పుబడుతున్నారు. ఎలుక వంటి హానికర జీవుల్ని చంపడం తప్పుకాదని, ఒక వేళ తన కొడుకుకు ఈ కేసులో శిక్ష పడితే, చికెన్, మటన్ కోసం, కోళ్లని, మేకల్ని చంపి తినేవాళ్లకు కూడా శిక్షలు వేయాలని డిమాండ్ చేస్తున్నారు.
శిక్షలేంటో తెలుసా..
ఈ కేసుకు సంబంధించి పోలీసుల చార్జిషీటు ఆధారంగా కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. సాధారణంగా జీవహింసకు పాల్పడితే, జంతు క్రూరత్వ నిరోధక చట్టం కింద పది రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంది. కొన్నిసార్లు ఐదేళ్ల జైలు శిక్ష, జరిమానా కూడా విధించవచ్చు. ప్రస్తుతం మనోజ్ కుమార్ ఎలుకను చంపిన కేసు సంచలనంగా మారింది. అతడికి శిక్ష పడిందంటే ఇకపై ఎవరైనా ఎలుకను చంపాలంటే భయపడిపోతారేమో!