50 షెల్ కంపెనీలు పెట్టి సుమారు 14 వందల కోట్లు మనీ లాండరింగ్ చేశాడు అతీక్. ఎస్పీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద కాంట్రాక్టులన్నీ అతీక్ చేయి దాటి బయటికి వెళ్లేవి కాదు. బడా కాంట్రాక్ట్‌లు అన్నీ అతని అండర్‌కి రావాల్సిందే. వేరే వాళ్లకు కాంట్రాక్ట్ ఇచ్చినా అతీక్‌కు పర్సంటేజ్ రావాల్సిందే. అదీ కాకుండా కిడ్నాప్‌లు చేసి, పేద ప్రజలను బెదిరించి వాళ్ల ఆస్తులు లాక్కునేవాడు. 2018లో జైలులో ఉండగానే ఓ బిజినెస్‌మ్యాన్‌ను బెదిరించి 40 కోట్ల ప్రాపర్టీ తన పేరున రాయించుకున్నాడు అతీక్.
తన కొడుకులతో బిజినెస్ మ్యాన్‌ను కిడ్నాప్ చేయించి జైలులోనే ప్రాపర్టీ రాయించుకున్నాడు. కానీ ఎరికీ అతన్ని ఎదిరించే ధైర్యం అప్పుడు లేకపోయింది. తన బినామీల పేరుతో చాలా సంస్థల్లో వేల కోట్లు పెట్టుబడులు పెట్టించాడు అతీక్. అతీక్ ఆగడాలు ఏ స్థాయికి వెళ్లాయి అంటే ఆఖరికి గాంధీ కుటుంబాన్ని కూడా అతను విడిచిపెట్టలేదు. ప్రయాగ్‌రాజ్‌లోనే రిచ్ ఏరియాగా పేరున్న సిటీలైన్స్‌లో గాంధీ కుటుంబానికి చెందిన వెర గాంధీ ప్యాలెస్ టాకీస్ ఉంది. ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్‌గాంధీకి ఆమె దగ్గరి బంధువు. ఆ భవనం పక్కనే అతీక్ అహ్మద్ ఓ బిజినెస్‌మ్యాన్ నుంచి బలవంతంగా కొంత స్థలం కొని బిల్డింగ్ స్టార్ట్ చేశాడు.
సైట్‌కు వచ్చిన ప్రతీసారి ఎండలో ఉండాల్సి వస్తోందని.. ప్యాలెస్ టాకీస్‌లో కొంత ప్లేస్ ఇస్తే అక్కడి నుంచి పనులను పర్యవేక్షించుకొంటానని అడిగాడు. ఓ చిన్న రూమ్ ఏర్పాటు చేసుకుని సైట్‌కు వచ్చిన ప్రతీ సారి అక్కడ ఉండేవాడు. కానీ, ఆ తర్వాత అతీక్ మొత్తం ఆస్తిని తన కబ్జాలో పెట్టుకున్నాడు. దీంతో వెర గాంధీ నాటి యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్, లోక్‌సభ స్పీకర్ సోమ్‌నాథ్ ఛటర్జీ, యూపీ సీఎం ములాయం సింగ్ యాదవ్‌కు లేఖలు రాసి తన గోడు వెళ్లబోసుకొంది. అప్పటికి అతీక్ ఎంపీగా ఉన్నాడు. సోనియా గాంధీ ఈ విషయంలో పర్సనల్‌గా ఇన్వాల్వ్ అయ్యారు. ఈ సమస్య పరిష్కరించే బాధ్యతను యూపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు రీటా బహుగుణా జోషికి అప్పగించారు. మరోవైపు పీఎంవో నుంచి కూడా ఒత్తిడి పెరిగింది. దీంతో అతీక్ చేసేదేమీ లేక స్వయంగా వెర గాంధీ వద్దకు వెళ్లి తాళాలు అప్పజెప్పాడు.
‘‘నాకు ఫోన్ చేస్తే నేనే తాళాలు అప్పజెప్పేవాడిని కదా’’ అని అతీక్ తనతో అన్నట్లు వెర గాంధీ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అతీక్ ఆక్రమించుకున్న తర్వాత వదిలేసిన ఏకైక ఆస్థి వెరా గాంధీది మాత్రమే. కానీ అతీక్‌ను ఏమీ చేయలేని ఎంతో మంది సామాన్యుల ఆస్థులు కొల్లగొట్టాడు అతీక్ అహ్మద్. ఎంతో మంది స్థలాలు కబ్జా చేశాడు. ఆఖరికి ప్రయాగ్‌రాజ్‌లో అతీక్ ఉంటున్న ఇల్లు కూడా కబ్జా చేసి కట్టుకుందే. 2020లో ఆ ఇంటిని ప్రయాగ్ రాజ్ మున్సిపాలిటీ కూల్చివేసింది. ఇలా ఎంతో మందిని రోడ్డుపాలు చేసి అక్రమాస్థులతో సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు. కానీ ఇప్పుడు ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అతీక్ అక్రమాస్థుల చిట్టా ఒక్కొక్కటిగా విప్పుతూ అవన్నీ రికవర్ చేస్తోంది.