Vande Bharath Express: వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ పై రాళ్లదాడి వెనుక రాజకీయ హస్తం ఉందా..?

  • Written By:
  • Updated On - February 13, 2023 / 01:12 PM IST

ఇండియన్‌ రైల్వేస్‌ ప్రతిష్ఠాత్మకంగా నడిపిస్తున్న వందే భారత్‌ రైళ్లకు నిత్యం ఏదో ఒక సంఘటన చోటు చేసుకుంటుంది. అతి వేగంతో అద్భుతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే ఈ రైళ్లపై కొంతమంది మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. ఆకర్షణీయంగా కనిపించే ఈ రైలు అద్దాలను అకతాయి నిత్యం ఏదో ఒక చోట రాళ్లతో ధ్వంసం చేస్తున్నారు. ఇలా జరగడం ఇది తొలిసారి కాదు. ఇప్పటికే రెండు మూడు సార్లు పలు రాష్ట్రాల్లో ఇలా ధ్వంసానికి పాల్పడ్డారు.

తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ పై రాళ్ల దాడి జరగడం కలకలం రేపింది. నాగ్‌పూర్‌ నుంచి బిలాస్‌పూర్‌కు వెళ్తున్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుపై ఛత్తీస్‌గఢ్‌లోని దధాపరాలో సోమవారం మధ్యాహ్నం రాళ్ల దాడి జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లోని దధాపరా నుంచి వందే భారత్ రైలు వెళుతుండగా పలువురు దుండగులు దానిపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో ఐదు కోచ్‌లలోని కనీసం తొమ్మిది కిటికీలు దెబ్బతిన్నాయని పోలీసులు వెల్లడించారు. అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, సురక్షితంగా ఉన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్).. దర్యాప్తును ప్రారంభించింది.

రైలులో అమర్చిన సీసీ కెమెరాలను ఉపయోగించి దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కొత్తగా ప్రారంభించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్లు రువ్విన సంఘటనలు పశ్చిమ బెంగాల్, బీహార్‌, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో రాళ్ల దాడి ఘటనలు జరిగాయి. ఇలా జరగడానికి రాజకీయ కారణాలు ఉండి ఉండవచ్చన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇలాంటి విధ్వంసకర చర్యలు కేవలం బీజేపీ ఏతర రాష్ట్రాల్లో మాత్రమే జరుగుతుండటం ఆసక్తికర పరిణామంగా చెప్పాలి. బీజేపీ గడిచిన ఎనిమిదేళ్లలో కేవలం ఒక్కరైలు ప్రారంభించి అభివృద్ది మంత్రాన్ని ఓటరు వద్దకు తీసుకెళ్లి వారిని ఎక్కడ తమవైపుకు లాక్కుంటుందో అన్న ఆలోచనల్లో భాగంగా ఇలా చేసి ఉండవచ్చనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా చేయడం వల్ల తమ ప్రాంతీయపార్టీలకే ఎదురుదెబ్బ తగిలే ప్రమాదం ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెబుతున్నారు విశ్లేషకులు.