Influencer Zhanna D’Art: వేగన్ డైటింగే ప్రాణం తీసిందా..? బక్కచిక్కి ప్రాణాలు పోగొట్టుకున్న ఇన్‌ఫ్లుయెన్సర్..!

తాజాగా ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ వేగన్ డైట్ ఫాలో అవుతూ.. చివరకు ప్రాణాలు పోగొట్టుకుంది. రష్యాకు చెందిన జన్నా సమ్సోనోవా (39) అనే మహిళ.. వేగన్ డైట్ ఫాలో అవుతూ, మంచి ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

  • Written By:
  • Publish Date - August 1, 2023 / 06:38 PM IST

Influencer Zhanna D’Art: డైటింగ్ మోజులో పడి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు కొందరు. తాజాగా ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ వేగన్ డైట్ ఫాలో అవుతూ.. చివరకు ప్రాణాలు పోగొట్టుకుంది. రష్యాకు చెందిన జన్నా సమ్సోనోవా (39) అనే మహిళ.. వేగన్ డైట్ ఫాలో అవుతూ, మంచి ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. జన్నా డి’ఆర్ట్‌ పేరుతో సోషల్ మీడియాలో, ఆన్‌లైన్‌లో పాపులారిటీ సాధించింది. వేగన్ డైట్ మాత్రమే ఫాలో అవుతూ.. ఈ డైట్ గురించి వివరించేది.

ఎక్కువగా పండ్లు, జ్యూస్‌లు మాత్రమే తీసుకునేది. కొంతకాలంగా ఇదే డైట్ ఫాలో అవుతోంది. కొద్ది రోజులుగా పండ్లు, సంబంధిత ఆహారమే తీసుకోవడంతో బక్కచిక్కిపోయింది. ముఖంలో కళ పోయి.. ఎముకల గూడులా తయారైంది. ఈ విషయం గుర్తించిన ఆమె తల్లి, స్నహితులు.. వేరే ఆహారం తినాలి అని చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. చాలా రోజులుగా సరైన ఆహారం లేకపోవడంతో తీవ్రంగా బలహీనపడింది. జన్నా ఇటీవల ఆసియా పర్యటనకు వెళ్లింది. ఈ పర్యటన సందర్భంగా మరింత అనారోగ్యానికి గురైంది. అనంతరం ఇంటికి చేరుకున్న తర్వాత ఆమె తీవ్ర అనారోగ్యానికి గురైంది. అప్పటికే పోషకాహార లోపంతో అథ్వాన స్థితికి చేరుకుంది. వెంటనే ఆమె కుటుంబ సభ్యులు జన్నాను ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ, జన్నా పరిస్థితి అప్పటికే విషమించడంతో వైద్య చికిత్స ఫలించలేదు. చివరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల ప్రాణాలు కోల్పోయింది.

జన్నా పోషకాహార లోపంతో తీవ్రంగా కృశించుకుపోయిందని, ఆమె డయేరియాలాంటి ఇన్ఫెక్షన్‌తో బాధపడిందని తల్లి చెప్పింది. తాను ఫాలో అయ్యే డైట్ కారణంగానే అనారోగ్యానికి గురై మరణించి ఉండొచ్చని చెప్పింది. అయితే, జన్నా మరణానికి వేగన్ డైటే కారణమని అధికారికంగా మాత్రం ఎవరూ ధృవీకరించలేదు. కాగా, జన్నా తన సన్నిహితుల నుంచి ఈ డైట్ గురించి తెలుసుకుంది. ఎప్పుడూ యవ్వనంగా కనిపించాలని, ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో వేగన్ డైట్ ఫాలో అయ్యిందని ఆమె స్నేహితులు తెలిపారు. పండ్లు మాత్రమే తినడంతో సరైన పోషకాలు అందకపోవడం వల్ల ఆమె అనారోగ్యం పాలైందని తెలుస్తోంది. ఆరోగ్యంగా ఉండాలంటే ఒంటికి అన్నిరకాల పోషకాలు అందాలని, అవగాహన లేకుండా ఇలాంటి డైట్ ఫాలో అవ్వడం సరికాదని వైద్యులు అంటున్నారు. కొన్ని రకాల డైట్స్ వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తి, ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.