Wedding Cancel: వరకట్నం ఇవ్వాలని వరుడితో పెళ్లి నిరాకరించిన వధువు..!

అబ్బాయిది పోచారం, అమ్మాయిది భద్రాద్రి కొత్తగూడెం. వీరికి పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబ పెద్దలు నిశ్చయించారు. దీనికి సంబంధించి ఘట్‌కేసర్‌లో పెళ్లి ఏర్పాట్లను పూర్తి చేసుకున్నారు. కానీ పె‌ళ్ళి మండపం వద్దనే పెటాకులైంది ఆ పెళ్లి. దీనికి కారణం వధువు. ఈమె కోరినంత కట్నం వరుడు ఇవ్వలేదని పె‌ళ్లికి నిరాకరించింది.

  • Written By:
  • Updated On - March 10, 2023 / 06:33 PM IST

పెళ్లి అంటే నిశ్చితార్థం మొదలు అప్పగింతల వరకు పెద్ద తంతు. ఇందులో వధూవరుల అభిప్రాయాలతో పాటూ.. పెద్దవారి అభిరుచులు కలవాలి. అభిరుచులు అంటే మాకేమిస్తారు – మీకేమివ్వాలి అనే ఒప్పందం. ఇది సాఫీగా సాగాలి. అప్పుడే పెళ్లి అనే మూడు ముళ్లు పడతాయి. మరీ ముఖ్యంగా ఆడపిల్ల ఇంటి వారికే ఎక్కువ బాధ్యతలు ఉంటాయి. వరుడి కుటుంబ సభ్యులు అడిగినంత కట్నం ఇవ్వడం వధువు ఇంటి పెద్దకు తలకు మించిన భారంలా కనిపిస్తుంది. అయినా అప్పో సోప్పో చేసి పెళ్లికి కావల్సిన డబ్బును సమకూరుస్తాడు. సాధారణంగా మనం చూసే వాతావరణం ఇలా ఉంటుంది. కానీ ఇక్కడ పూర్తి విరుద్దంగా అమ్మాయి ఒప్పుకోకపోవడం కాస్త ఆసక్తి కలిగిస్తుంది.

సమాజంలో ఎక్కడైనా పెళ్లికొడుకు కుటుంబ సభ్యులు కట్నం అడుగుతారు. అది ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయమని వెనకేసుకొస్తారు. ఇది చట్ట విరుద్దం అంటూ ప్రభుత్వాలు వరకట్న నిషేధ చట్టాన్ని కూడా తీసుకువచ్చాయి. కానీ ఇవి ఎక్కడా ఆగడం లేదు. కట్నం తీసుకునే పెళ్లి వ్యవహారాలు గుట్టు చప్పుడు కాకుండా సాగిపోతూ ఉంటాయి. కొందరు వరకట్నం తీసుకోకుండా.. పెళ్లి ఖర్చులు కూడా తామే భరిస్తామని ముందుకొచ్చే వరుడి కుటుంబాలు అక్కడక్కడా కనిపిస్తూ ఉంటాయి. పూర్వంతో పోలిస్తే వరకట్న వేధింపులు కొంత తక్కువయ్యాయని చెప్పాలి. ఒకప్పుడు 100కు 80 కేసులు ఉంటే ప్రస్తుతం 100కు 40-50 మంది ఉన్నారు. వీరిలో కొందరు బయట పడితే మరికొందరు వెలుగులోకి రానివ్వరు. దీనికి కారణం చట్టాల పట్ల కొంత అవగాహన, సమాజంలో గౌరవమని చెప్పాలి.

ఇక్కడి వరకూ చెప్పుకున్నది బాగానే ఉంది. పైగా అబ్బాయి తరఫున వచ్చే కట్నం పరిస్థితులు వధువు ఇంటి పెద్దల ఇబ్బందులు తెలుసుకున్నాం. కానీ ఈ అమ్మాయి మేము అన్ని రంగాల్లో ముందున్నాం అని వింతగా ఆలోచించిందేమో బహుశా. నాకు కూడా కట్నం కావాలని భీష్మించుకు కూర్చుంది. ఈమె చేసిన మారాంకు పెద్దలు కుదిర్చిన పెళ్లి, పీటలదాకా వచ్చి ఆగిపోయింది. దీంతో అబ్బాయి కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. పిల్ల కుటుంబీకులను విషయం అడిగి తెలుసుకున్నారు. పెళ్లి కొడుకు ఇంటి సభ్యులు ఇచ్చే రూ.2 లక్షల కట్నం తనని తృప్తి పరచలేదని నాకు ఇంకా అదనంగా కట్నం కావాలని తేల్చి చెప్పింది. అందుకే నాకు ఇతనిని పె‌ళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తెలిపింది. ఇక చేసేదేమీలేక అబ్బాయి ఇంటివారు పోలీసులను ఆశ్రయించారు. అమ్మాయి ఇంటి వారిని స్టేషన్ కు పిలిపించి మాట్లాడారు. చివరకు కట్నంగా ఇచ్చిన రూ.2 లక్షలు కూడా వదులుకొని వెనుదిరిగి పోయారు.

అబ్బాయిలనే కట్నం అడగకూడదు అంటూ షరతులు పెడుతుంటే అమ్మాయిలు ఈ విధంగా ప్రవర్తించడం చాలా హేయమైన చర్యగా చెప్పాలి. ఎందుకంటే పెళ్లి కోసం చేసుకున్న ఏర్పాట్లు పిలిపించుకున్న బంధు మిత్రుల మధ్య ఇలా జరిగితే అ కుటుంబానికి ఎంతటి ఘోర అవమానమో ఒక్కసారి ఆలోచించాలి. అంతేకాకుండా ఏర్పాట్లకు చేసుకున్న ఖర్చు వృధా అయిపోయిందని గుర్తించాలి. అబ్బాయి, అమ్మాయి ఎవరైనా చట్టం ముందు సమానమే అనేలా రూల్స్ ని తీసుకురావాలి. ఇలా ప్రవర్తించిన వారికి కఠినంగా శిక్షించాలి. అప్పుడే ఇలాంటి ఘాతుకాలు భవిష్యత్తులో మరిన్ని చోటు చేసుకోకుండా నిరోధించగలం.

తల్లిదండ్రులు కూడా తమ కూతురిని భారంగా భావించే పరిస్థితులు ప్రస్తుత సమాజంలో అక్కడక్కడా కనిపిస్తున్నాయి. అందుకే పెళ్లి చేసి చెయ్యి దులుపుకొని తనపై ఉన్న బాధ్యతను నిర్వర్తించుకోవాలని చూస్తున్నారు. అందుకే ఇలాంటి వింత సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పె‌ళ్లికి ముందే ఇలా జరిగింది కాబట్టి సరిపోయింది. అదే పెళ్లి తరువాత ఏమైనా ఇలా జరిగితే అప్పుడు అబ్బాయి వాళ్లకు ఏమని సమాధానం చెప్పేవాళ్లు ఒకసారి ఆలోచించండి. అలగే అమ్మాయి వెళ్లిన ఇంట్లో ఆనందంగా ఉంటుందా.. ఉండదా అనే విషయాన్ని గుర్తు చేసుకోవడంలేదు కనుకనే ఇలాంటి విచిత్ర ఘటనలు సమాజంలో జీవం పోసుకుంటున్నాయి. తమ అమ్మాయికి ఇష్టం లేకుంటే స్వేచ్ఛగా వదిలేయండి. అంతేతప్ప బలవంతంగా రుద్దకండి. ఇప్పుడు అమ్మాయిలు భారంగా కాదు. వారే భవిష్యత్తుగా మారబోతున్నారు అన్న విషయాన్ని గుర్తించండి.

 

 

T.V.SRIKAR