Israel-Palestine War: ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య యుద్ధం జరుగుతున్న వేళ యుద్ధ నేరాలకు సంబంధించిన అంశం మరోసారి చర్చకు వచ్చింది. ఈ యుద్ధంలో హమాస్ తీవ్రవాదులు యుద్ధ నేరాలకు పాల్పడుతున్నారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇజ్రాయెల్ సైన్యంపై కూడా పాలస్తీనా ఇదే తరహా ఆరోపణ చేస్తోంది. ఈ నేపథ్యంలో యుద్ధ నేరాలంటే ఏంటి..? ఈ విషయంలో సైన్యం పాటించాల్సిన నిబంధనలేంటి..?
1998లో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ (ఐసీసీ) యుద్ధ నేరాలకు (వార్ క్రైమ్) స్పష్టమైన నిర్వచనం ఇచ్చి, నిబంధనలు, విధి విధానాలు రూపొందించింది. ఈ విషయంలో సైన్యానికి, పౌరులకు మధ్య ఉండే సంబంధాలు, సంఘర్షణపై మార్గదర్శకాలు రూపొందించింది. దీనిలో అనేక అంశాల్ని చేర్చింది.
సాధారణ పౌరులు, యుద్ధ ఖైదీలు, బంధీల విషయంలో అనుసరించాల్సిన నిబంధనల్ని పొందుపర్చింది. దీని ప్రకారం.. యుద్ధంలో సాధారణ పౌరుల్ని ఉద్దేశపూర్వకంగా చంపకూడదు. వారిని బందీలుగా తీసుకోకూడదు. అలాగే ప్రజలు ఉంటున్న నివాసాలు, మత పరమైన, విద్యా పరమైన బిల్డింగులు ధ్వంసం చేయకూడదు. కళలకు సంబంధించి, చారిత్రకమైన, శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందిన, సేవా సంస్థలకు చెందిన వాటిపై, ఆస్పత్రులపై దాడులు చేయకూడదు. ధ్వంసం చేయకూడదు. ప్రజలు తలదాచుకున్న ప్రదేశాలపై కూడా దాడి చేయకూడదు. పౌరులు ఉన్న ఏ ప్రదేశంపై ఉద్దేశపూర్వకంగా, నేరుగా దాడి చేయకూడదు. బందీలుగా తీసుకోకూడదు. వారికి ఏ రకంగా హాని చేయకూడదు. చంపకూడదు. హింసించినా, అత్యాచారాలకు పాల్పడ్డా తీవ్ర నేరంగా పరిగణిస్తారు. అలాగే బందీలుగా తీసుకున్న వారిని ఆకలితో ఉంచడం కూడా నేరమే. వాళ్లు జీవించేందుకు అవసరమైన వాటిని అందుబాటులో ఉంచాలి. ఇలాంటి 50కిపైగా అంశాలను యుద్ధ నేరాలుగా భావిస్తారు. ఈ చర్యలకు పాల్పడితే యుద్ధ నేరంగా, మానవత్వానికి వ్యతిరేక చర్యలుగా పరిగణిస్తుంది ఐసీసీ.
యుద్ధ నేరాలకు పాల్పడ్డ హమాస్
తాజా యుద్ధానికి కారణం ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు అనే సంగతి తెలిసిందే. గాజా దాటి ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతంలోకి చొరబడ్డ హమాస్ తీవ్రవాదులు.. అక్కడి పౌరులపై దాడులకు పాల్పడ్డారు. ఆయుధాలతో వెళ్లి, విచక్షణారహితంగా కాల్చిచంపారు. ఇంటింటికీ వెళ్లి పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా చంపారు. ఇలా సాధారణ ప్రజలపై నేరుగా దాడులకు పాల్పడటం కచ్చితంగా యుద్ధ నేరమే. సాధారణ పౌరులపైకి రాకెట్ దాడులు చేయడం కూడా నేరంగా పరిగణించాలని నిపుణులు చెబుతున్నారు. ఇజ్రాయెల్ సరిహద్దు నగరంపై దాడి చేసి, మ్యూజిక్ ఫెస్టివల్‌లో పాల్గొంటున్న 270 మందిని హమాస్ తీవ్రవాదులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఇది కూడా తీవ్ర యుద్ధ నేరమే.