Whatsapp Scam: ప్రస్తుతం వాట్సాప్ యూజర్లను ఫేక్/స్కామ్ కాల్స్ బెంబేలెత్తిస్తున్నాయి. ఇండియాలోని యూజర్లు ఈ కాల్స్ ప్రభావానికి గురవుతున్నారు. అంతర్జాతీయ కాల్స్ కావడంతో వీటి విషయంలో ఇక్కడి సైబర్ నిపుణులు కూడా ఏం చేయలేకపోతున్నారు. వాట్సాప్‌లో కొద్ది రోజులుగా మలేసియా, ఇథియోపియా, కెన్యా, వియత్నాం కోడ్ కలిగిన నెంబర్ల నుంచి కాల్స్ వస్తున్నాయి.
ఫేక్ జాబ్స్ పేరుతో వినియోగదారుల్ని మోసం చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే న్యూడ్ కాల్స్ చేసి, వీడియోలు రికార్డింగ్ చేసి బెదిరిస్తున్నారు. ఆర్థిక మోసాలకు కూడా పాల్పడే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ఇంతగా ఇంటర్నేషనల్ కాల్స్ ఇండియా యూజర్లను కంగారు పెడుతుండటంతో వాట్సాప్ సంస్థ స్పందించింది. ఈ విషయంలో యూజర్లకు కొన్ని సూచనలు చేసింది. విదేశీ నెంబర్ల నుంచి కాల్స్ వస్తే వెంటనే నెంబర్ బ్లాక్ చేసి, రిపోర్ట్ చేయాలని సూచించింది. ఇలా చేస్తే ఆ నెంబర్లను బ్లాక్ చేసి, ఇతరులకు కాల్స్ చేయకుండా నిరోధిస్తామని చెప్పింది. విదేశీ నెంబర్ల నుంచి కాల్స్ మాత్రమే కాకుండా.. మెసేజెస్ వచ్చినా వాటికి స్పందించకూడదని, నెంబర్ బ్లాక్ చేయాలని సూచించింది.
అలాగే మీ వ్యక్తిగత వివరాలు యూజర్లకు కనిపించకుండా ప్రైవసీ సెట్టింగ్స్ చేసుకోవాలని చెప్పింది. దీని ప్రకారం.. ప్రైవసీ కంట్రోల్‌లోకి వెళ్లి కాంటాక్టుల్లోని వ్యక్తులకు మాత్రమే మీ ప్రొఫైల్ కనిపించేలా సెట్ చేసుకోవాలి. ఇప్పటికే ఇలాంటి మోసాల్ని అరికట్టేందుకు అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నట్లు, అలాగే ఏఐ, ఇతర టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు వాట్సాప్ సంస్థ వెల్లడించింది. వీడియోలకు లైక్ కొడితే డబ్బులిస్తామని, ఆన్‌లైన్ జాబ్స్, వర్క్ ఫ్రం హోం జాబ్స్ ఇస్తామని.. ఇలా రకరకాలుగా ఫేక్ నెంబర్ల ద్వారా స్కామర్లు యూజర్లను మోసం చేస్తున్నారు. ఇలాంటి వాటికి స్పందించకుండా ఉండాలి. అలాగే వాట్సాప్ మెనూలోకి వెళ్లి బ్లాక్ చేయాలి. సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకుంటే ఫేక్ కాల్స్, మెసేజెస్ నుంచి తప్పించుకోవచ్చు.