యత్ర నార్యంతు పూజ్యతే.. రమంతే తత్ర దేవతః ! ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో.. అక్కడ దేవతలు సంచరిస్తారని ! అమ్మాయిలను పూజించాల్సిన అవసరం లేదు.. బతకనిస్తే చాలు ! వరంగల్ మెడికల్ స్టూడెంట్ ప్రీతి మరణం తర్వాత వినిపిస్తున్న మాట ఇదే ! స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా.. ఇప్పుడిప్పుడే ఆడది ధైర్యంగా అడుగులు బయట వేస్తోంది. ఆశలు మోస్తోంది.. ఆశయం కోసం బతుకుతోంది. అలాంటి ఆశలను ఆదిలోనే చిదిమేస్తే!
పోస్టుమార్టం రిపోర్టు ఏమైనా రావొచ్చు.. ఆత్మహత్యే కావొచ్చు.. ప్రీతిది మాత్రం ముమ్మాటికి హత్యే ! ప్రత్యక్షంగానో పరోక్షంగానో అందరూ కలిసి ఓ ఆశ గొంతు చిదిమేసి చంపేశారు. ప్రీతి మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఆడపిల్ల కన్నీళ్లు పడిన చోటు.. శ్మశానంతో సమానం ! సీనియర్లు వేధిస్తున్నారని ఎంత ఏడ్చి ఉంటుంది.. ఎంత బాధపడి ఉంటుంది.. సరైన సమయంలో స్పందించి ఉంటే.. ఇలా జరిగేదా ? తప్పు ఎవరిది.. ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులదా.. ర్యాగింగ్ కామన్ అని చేతులు దులుపుకున్న సిబ్బందిదా.. వాడెవడో బ్యాక్‌గ్రౌండ్ చూసి కనీసం పట్టించుకోని పోలీసులదా.. ఇంత జరుగుతున్నా పట్టించుకోని తోటి విద్యార్థులదా ? అందరిది తప్పే ! ఈ చావులో అందరికీ భాగం ఉంది.
సైఫ్ వేధింపులకే బలి అయిందని.. అతన్ని ఉరి తీయాలని చాలా గొంతులు నిలదీస్తున్నాయ్ ఇప్పుడు ! నిజంగా ఉరి తీయడమే మొదలుపెడితే.. ప్రీతి బతికి ఉన్నప్పుడు ఆమె బాధను పట్టించుకోని హెచ్‌వోడీలను, యాజమాన్యాన్ని, తోటి విద్యార్థులను.. అందరిని ఉరి తీయాలి ! మెడికల్ కాలేజీల్లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో.. విద్యార్థులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో.. ప్రీతి చావు చెప్తోంది ! జూనియర్ మెడిసిన్‌లో ర్యాగింగ్ ఉంటుంది.. పీజీలో ఉండదు అని సమాధానం చెప్పిన సిబ్బందిని ఏమనాలి.. అంతా తెలిసే జరుగుతుందా.. జరిగినా తెలిసీ తెలియనట్లు ఉన్నారా.. ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది.
ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థి.. దేశ భవిష్యత్ మోయాలనుకున్న విద్యార్థి.. చదువుల తల్లి.. ఇలాంటి ప్రీతి బతుకు అర్థాంతరంగా ముగిసింది.. ర్యాగింగ్ అనే భూతం వల్ల ! ఒక్క అమ్మాయిని టార్గెట్ చేసి.. మిగతా విద్యార్థులంతా ఆడుకోవడం ఏంటి.. ఇదీ సార్ పరిస్థితి అని ఓ తండ్రి కన్నీళ్లతో ఫిర్యాదు చేసినా కాలేజీ సిబ్బంది, పోలీసులు పట్టించుకోకపోవడం ఏంటి.. ఇంత జరుగుతుంటే.. టీవీలు చూసి కన్నీళ్లు తుడుచుకొని మన పనిలో మనం మునిగిపోవడం ఏంటి ? సిగ్గులేదు మనందరికి ! ప్రీతి ఘటనపై చర్చ జరుగుతుండగానే.. అదే వరంగల్‌లో మరో విద్యార్థిని ర్యాగింగ్‌కు బలి కావడం.. వ్యవస్థలో లోపాలకు, ప్రభుత్వం చేతగానితనానికి అద్దం పడుతోంది. ర్యాగింగ్ కామన్ అని అనుకుంటున్నారా.. నిజంగా అలా అనుకుంటే.. సబ్జెక్ట్స్‌లో, స్టడీ పీరియడ్స్‌లో భాగం చేయండి అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
ప్రీతి మరణం నుంచి ప్రభుత్వాలు, పాలకులు, జనాలు పాఠాలు నేర్చుకోవాలి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు హడావుడి చేసి సైలెంట్ అవడం కాదు. దీనికి చెక్ పెట్టాలి. మీ ఇంటి నుంచి.. మా ఇంటి నుంచి.. మన ఇంటి నుంచి చదువు కోసం అమ్మాయిలు కాలేజీలకు వెళ్తారు. ఆ రోజు.. మనకు తెలిసిన మరో ప్రీతి అనే మాట వస్తే.. అధికారిగా, సిబ్బందిగా, వ్యవస్థగా, వ్యవస్థలో మనిషిగా ప్రతీ ఒక్కరు ఫెయిల్ అయినట్లే !