Satwik: సాత్విక్ కేసు పక్కదారి పట్టనట్లేనా.. నిజంగా అరెస్ట్ చేయాల్సింది ఎవరిని?

లక్షలకు లక్షలు ఫీజులు తీసుకొని.. ర్యాంకుల యావలో పడి విద్యార్థులకు నరకం చూపించే ఏ సంస్థలో అయినా సరే.. ముందు మేనేజ్‌మెంట్‌ను ఊచల వెనక్కి నెట్టాలి. సాత్విక్ కేసులోలా.. కింది స్థాయి ఉద్యోగులను అరెస్ట్ చేసినట్లు చూపించి.. చేతులు దులుపుకుంటే.. ఇలాంటి దారుణాలు ఆగవు.. కన్నీళ్లు తీరవు !

  • Written By:
  • Publish Date - March 3, 2023 / 07:59 PM IST

అమ్మానాన్న ప్రేమ గుర్తొచ్చింది.. అన్నతో అల్లరి గుర్తొచ్చింది. ఇవేవీ ఆ ప్రాణాన్ని ఆపలేదు. చదువే బతుకని భావించి.. చదువు వల్లే బతుకులు చాలించిన ఇంటర్మీడియట్ విద్యార్థి సాత్విక్ జీవితం.. కన్నీరు పెట్టిస్తోంది. లెక్చరర్లు బాధపెట్టారని.. ర్యాంకుల కోసం ఇబ్బంది పెట్టారని కనిపించినా.. బయటకి వినిపించని ప్రశ్నలు ఎన్నో ఆ సూసైడ్‌ నోట్‌లో ఉన్నాయ్. ఎప్పటిలాగే అధికారులు హడావుడి స్టార్ట్ చేశారు. విద్యాశాఖ తల్లి.. ఆ కాలేజీ యాజమాన్యానికి హెచ్చరికలు చేశారు.. ఇప్పుడు వాడెవడో ఆచార్య అనే లెక్చరర్‌తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. అంతే.. కథ ఖల్లాస్ ! అరెస్టులు అయిపోయాయ్ కదా.. కథ ముగిసినట్లే !

సాత్విక్‌ కేసులో నెక్ట్స్ జరగబోయేది ఇదేనా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. ప్రిన్సిపాల్‌, లెక్చరర్, వార్డెన్‌, క్లర్క్‌.. ఈ నలుగురిని అరెస్ట్ చేశారు. నిజంగా ఊచల వెనక వేయాల్సింది వీళ్లేనేనా.. కాదంటే కాదు ! వీళ్లు కేవలం ఉద్యోగులు మాత్రమే.. మేనేజ్‌మెంట్‌ను వదిలేసి కింది స్థాయి ఉద్యోగులను బలి పశువులను చేసి… కేసు మమ అనిపించడమేనా? నిజంగా మేనేజ్‌మెంట్‌ను అరెస్ట్ చేయగలరా.. అంత దమ్ముందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయ్. ఇప్పుడు చర్చ జరుగుతోంది ఒక్క సాత్విక్ గురించే! గత పదేళ్లలో వేల ప్రాణాలు బిల్డింగ్‌ మీద నుంచి దూకేశాయ్. రైలు పట్టాల కింద నలిగిపోయాయ్. తాడుకు వేళ్లాడాయ్. ఇవన్నీ ఆత్మహత్యలు కాదు.. కాలేజీలను కార్ఖానాలుగా మార్చేసి చేస్తున్న హత్యలు ! ఈ హత్యలకు కారణం అయిన వారిని అరెస్ట్ చేసే దమ్ము ఈ ప్రభుత్వాలకు, అధికారులకు ఉందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయ్.

నారాయణ, శ్రీచైతన్య.. మరో కార్పొరేట్‌ కాలేజీ.. తప్పు జరిగితే చైర్మన్‌ను జైల్లో వేయాలి.. అలా అరెస్ట్ చేసి లోపల వేస్తేనే పరిస్థితిలో మార్పు వస్తుంది. ఓ భయం ఉంటుంది. లక్షలు వసూలు చేసి కోట్లు సంపాదించుకుంటున్న మేనేజ్‌మెంట్‌ను వదిలేసి కింది స్థాయి ఉద్యోగులను బలి చేస్తే ఎలా ? తల్లిదండ్రుల ఆశలను ఆయుధంగా చేసుకున్నారు. చదువును వ్యాపారం చేశారు. అక్షరాలు అమ్ముకోవడం మొదలుపెట్టారు. ఇన్నీ చేసి, ఇంత వసూలు చేసి.. విద్యార్థులకు కనీస సౌకర్యాలు అందిస్తున్నారా అంటే అదీ లేదు. పైగా చదువు పేరు చెప్పిన నరకం చూపిస్తున్నారు. అక్షరం ఉసురు పోసుకోవడం కరెక్ట్ కాదు. ర్యాంకుల బోర్డులే.. ఆ ఫ్లెక్సీల వెనక కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులకు చూపించే నరకం ఎవరికీ కనిపించడం లేదు.

సాత్విక్ మరణంతో తల్లిదండ్రులు ఇది తెలుసుకోవాలి. విద్యను వ్యాపారంగా చూసి.. విద్యార్థులను వ్యాపార వస్తువుగా చేసి.. కనీసం పట్టించుకోని.. తమ చేతులకు మరకలు అంటకుండా తిరుగుతున్న మేనేజ్‌మెంట్‌లతో ఊచలు లెక్కించినప్పుడే.. సాత్విక్‌లాంటి మరణాలు తగ్గుతాయ్. ఇదే పరిస్థితి కొనసాగితే వేలల్లో ఆత్మహత్యలు లక్షల్లోకి చేరుతాయ్. చదువు అంటే రాయడం మాత్రమే అనే స్థాయికి.. నేటి చదువులు దిగిపోయాయ్. కాదు అలా తయారు చేశాయ్‌ కార్పొరేట్ సంస్థలు. లక్షలకు లక్షలు ఫీజులు తీసుకొని.. ర్యాంకుల యావలో పడి విద్యార్థులకు నరకం చూపించే ఏ సంస్థలో అయినా సరే.. ముందు మేనేజ్‌మెంట్‌ను ఊచల వెనక్కి నెట్టాలి. సాత్విక్ కేసులోలా.. కింది స్థాయి ఉద్యోగులను అరెస్ట్ చేసినట్లు చూపించి.. చేతులు దులుపుకుంటే.. ఇలాంటి దారుణాలు ఆగవు.. కన్నీళ్లు తీరవు !