Shraddha Walkar: శ్రద్ధావాకర్ తరహాలో ప్రియుడిని హత్య చేసిన ప్రియురాలు.. మృతదేహాన్ని ముక్కలుగా నరికి దారుణం

ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇటీవల ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయి. తాజాగా తమిళనాడులో ఇలాంటి దారుణ ఘటనే జరిగింది. అయితే, ఈసారి మాజీ ప్రేయసే తన ప్రియుడిని చంపింది.

  • Written By:
  • Publish Date - April 4, 2023 / 04:23 PM IST

Shraddha Walkar: గత ఏడాది ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ హత్య ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. శ్రద్ధా వాకర్‌ను ఆమె ప్రియుడు ఆఫ్తాబ్ పూనావాలా హత్య చేసి, ఆ తర్వాత ఆమె శరీర భాగాల్ని ముక్కలుగా నరికాడు. ఆ తర్వాత ఒక్కో శరీర భాగాన్ని ఒక్కో చోట పారవేస్తూ వచ్చాడు. శ్రద్ధా వాకర్ హత్య నుంచి స్ఫూర్తి పొందారో ఏమోకాని ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయి. తాజాగా తమిళనాడులో ఇలాంటి దారుణ ఘటనే జరిగింది. అయితే, ఈసారి మాజీ ప్రేయసే తన ప్రియుడిని చంపింది. అలాగే అతడి శరీరాన్ని ముక్కలుముక్కలు చేసింది. ఆ శరీర భాగాల్ని 400 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి పాతిపెట్టింది.

లాడ్జిలో పరిచయం.. ఆ తర్వాత పెళ్లి
తమిళనాడు విల్లుపురం గ్రామానికి చెందిన ఎమ్ జెయంతన్ (29) చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో పని చేస్తున్నాడు. అతడికి 2020లో తాంబరంలోని ఒక లాడ్జిలో భాగ్యలక్ష్మి (40) అనే సెక్స్ వర్కర్ పరిచయమైంది. ఈ క్రమంలో జెయంతన్-భాగ్యలక్ష్మి మధ్య మంచి బంధం ఏర్పడింది. దీంతో జెయంతన్ ఆమెను ఒక దేవాలయంలో పెళ్లి చేసుకున్నాడు. ఆ సమయానికి ఆమె కుటుంబ నేపథ్యం గురించి అతడికి ఏమీ తెలియదు. అయితే, జెయంతన్-భాగ్యలక్ష్మి వివాహ బంధం ఎంతోకాలం సాగలేదు.

ఇరువురి మధ్య సఖ్యత లేకపోవడంతో 2021లో విడిపోయారు. అప్పటికే భాగ్యలక్ష్మికి జెయంతన్ చాలా డబ్బులు ఇచ్చాడు. ఈ విషయంలో కూడా ఇరువురి మధ్య విబేధాలున్నట్లు తెలుస్తోంది. కాగా, గత మార్చి 18న అతడు చెన్నై నుంచి తన స్వస్థలమైన విల్లుపురం వెళ్తున్నట్లు తన అక్కకు చెప్పాడు. అయితే, అతడు విల్లుపురం వెళ్లలేదు. అతడికి ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన అతడి సోదరి మూడు రోజుల తర్వాత.. అంటే మార్చి 21న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరపగా అసలు విషయం బయటపడింది.

విచారణ సాగిందిలా..
మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాల్ రికార్డ్స్ ఆధారంగా విచారణ ప్రారంభించారు. అతడి ఫోన్ పుడుకొట్టాయ్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఈ కాల్ రికార్డ్స్ ఆధారంగా భాగ్యలక్ష్మిపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో జెయంతన్‌ను తామే హత్య చేసినట్లు ఆమె అంగీకరించింది. కానీ, హత్య చేసిన విధానం తెలిసి పోలీసులు షాకయ్యారు. దీని గురించిన దారుణ విషయాల్ని పోలీసులు మీడియాకు వివరించారు.

హత్య చేసి, ముక్కలుగా నరికి
జెయంతన్‌ను భాగ్యలక్ష్మి పుడుకొట్టాయ్ తన ఊరు పిలిపించుకుంది. దీంతో విల్లుపురం వెళ్లాల్సిన జెయంతన్ పుడుకొట్టాయ్‌లోని ఆమె ఇంటికి చేరుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది. దీంతో కోపం తెచ్చుకున్న భాగ్యలక్ష్మి తన స్నేహితుడిని ఇంటికి పిలిచింది. అతడు మరో ఇద్దరితో కలిసి ఇంటికి చేరుకున్నాడు. తర్వాత ఆ ముగ్గురితో కలిసి, ఆమె జెయంతన్‌ను హత్య చేసింది. తర్వాత అందరూ కలిసి మార్చి 20న అతడి శరీర భాగాల్ని ముక్కలు చేశారు. తర్వాత అతడి కాళ్లు, చేతుల్ని ప్లాస్టిక్ బ్యాగుల్లో చుట్టి 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెన్నై సమీపంలోని కోవల్లూరులోని రహస్య ప్రదేశంలో పాతిపెట్టారు.

తర్వాత ఎప్పట్లాగే పుడుకొట్టాయ్‌ తిరిగి వెళ్లారు. తర్వాత మార్చి 26న భాగ్యలక్ష్మి కూడా ఒక క్యాబ్ బుక్ చేసుకుంది. మిగిలిన జెయంతన్ శరీర భాగాల్ని ఆ క్యాబ్‌లో కోవల్లూరు తీసుకెళ్లి పాతిపెట్టింది. ఈ విషయంలో ఒక గుడి పూజారి ఆమెకు సహాయం చేశాడు. ప్రస్తుతం పోలీసులు భాగ్యలక్ష్మిని మాత్రమే అరెస్టు చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. మరోవైపు జెయంతన్ శరీర భాగాల్ని పాతిపెట్టిన ప్రదేశంలో తవ్వి, వెలికి తీయాల్సిందిగా పోలీసులు స్థానిక అధికారులను ఆదేశించారు. అయితే, శ్రద్ధా వాకర్ తరహాలో జరిగిన ఈ దారుణ ఘటన సంచలనం సృష్టించింది.

శ్రద్ధా తరహా ఘటనలు
ఢిల్లీలో శ్రద్ధా వాకర్ తరహా ఘటన బయటపడ్డ తర్వాతే ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయి. ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, న్యూఢిల్లీతోపాటు అనేక చోట్ల ఇలాంటి ఘటనలే జరిగాయి. తాజాగా జెయంతన్ హత్య జరిగింది. అన్ని ఘటనల్లోనూ హత్య చేసిన అనంతరం ఎవరికీ దొరక్కుండా, మృతదేహాల్ని ముక్కలుగా నరుకుతున్నారు. శరీర భాగాల్ని వేర్వేరు చోట్ల పడేస్తున్నారు. లేదా ఇంట్లోనే ఫ్రీజర్లలో దాచేస్తున్నారు. అయితే, తర్వాత పోలీసుల విచారణలో దొరికిపోతున్నారు.