YS Bhaskar Reddy Arrest: వై.ఎస్.భాస్కర్ రెడ్డి అరెస్ట్.. నెక్స్ట్ అవినాశ్ రెడ్డేనా..?

వారం రోజుల వ్యవధిలోనే ముగ్గురు కీలక వ్యక్తులను వివేకా హత్య కేసులో అరెస్టు చేసింది సీబీఐ. ఇప్పుడు తండ్రి, పీఏ, అనుచరుడిని అరెస్టు చేయడంతో తర్వాత అవినాశ్ రెడ్డి ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది.

  • Written By:
  • Updated On - April 16, 2023 / 10:14 AM IST

వై.ఎస్.వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో సంచలనం నమోదైంది. కడప ఎంపీ (Kadapa MP) వై.ఎస్.అవినాశ్ రెడ్డి (YS Avinash Reddy) తండ్రి వై.ఎస్.భాస్కర్ రెడ్డిని (YS Bhaskar Reddy) సీబీఐ (CBI) అరెస్టు చేసింది. పులివెందులలోని (Pulivendula) ఆయన నివాసంలో తెల్లవారుజామున సీబీఐ (CBI) అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం హైదరాబాద్ కు (Hyderabad) తరలించారు. సాయంత్రం భాస్కర్ రెడ్డిని జడ్జి (Judge) ముందు ప్రవేశ పెట్టనున్నారు. వివేకా (Viveka) హత్య కేసులో అన్ని వేళ్లూ అవినాశ్ రెడ్డి (Avinash Reddy) కుటుంబంపైనే చూపిస్తున్నాయని సీబీఐ చెప్తోంది. ఇప్పుడు అది అరెస్టుల దాకా వచ్చింది.

తెల్లవారుజామున 5 గంటల 10 నిమిషాలకు కడప జిల్లా (Kadapa District) పులివెందుల లోని అవినాశ్ రెడ్డి నివాసానికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. అప్పటి నుంచి 6 గంటల 10 నిమిషాల వరకూ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సమయంలో ఇంట్లోకి ఎవరినీ అనుమతించలేదు. సీబీఐ అధికారులు వచ్చిన విషయం తెలుసుకుని స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. భాస్కర్ రెడ్డి సోదరుడు ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. కానీ సీబీఐ అనుమతించలేదు. కనీసం లాయర్ (Lawyer) నైనా అనుమతించాలని భాస్కర్ రెడ్డి కోరినా సీబీఐ అధికారులు పట్టించుకోలేదు. చివరకు 6.30 గంటల సమయంలో భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తరలిస్తున్నట్టు ఆయన భార్యకు మెమో ఇచ్చారు. భాస్కర్ రెడ్డిని హైదరాబాద్ తరలించారు.

మరోవైపు.. అవినాశ్ రెడ్డి పీఏ (Avinash Reddy PA ) రాఘవ రెడ్డిని (Raghava Reddy) కూడా సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. వివేకా హత్య జరిగిన సమయంలో రక్తపు మరకలను చెరిపేయడం ద్వారా రాఘవ రెడ్డి సాక్ష్యాధారాలను తారుమారు చేశారని అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోపణలపై రాఘవ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. రెండ్రోజుల క్రితం అవినాశ్ రెడ్డి ముఖ్య అనుచరుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని (Gajjala Uday Kumar Reddy) సీబీఐ అరెస్టు చేసింది. వివేకా హత్య సమయంలో అవినాశ్ రెడ్డి నివాసంలో గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి ఉన్నట్టు గూగుల్ టేకవుట్ (Google Takeout) ద్వారా సీబీఐ గుర్తించింది. దీంతో సీబీఐ అతడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతోంది.

వారం రోజుల వ్యవధిలోనే ముగ్గురు కీలక వ్యక్తులను వివేకా హత్య కేసులో అరెస్టు చేసింది సీబీఐ. ఇక మిగిలింది అవినాశ్ రెడ్డే అనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే పలుమార్లు అవినాశ్ రెడ్డిని విచారించింది సీబీఐ. కుటుంబ కలహాల వల్లే వివేకా హత్యకు గురయ్యారని సీబీఐ నిర్ధారణకు వచ్చింది. గత విచారణ సమయంలోనే అవినాశ్ రెడ్డి అరెస్ట్ ఖాయమనుకున్నారు. అయితే అలా జరగలేదు. ఇప్పుడు తండ్రి, పీఏ, అనుచరుడిని అరెస్టు చేయడంతో తర్వాత అవినాశ్ రెడ్డి ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది.