12th Fail: బాలీవుడ్‌లో గత శుక్రవారం విడుదలై, మంచి విజయం అందుకున్న చిత్రం 12th ఫెయిల్. చిన్న చిత్రంగా, పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా నెమ్మదిగా బాక్సాఫీస్ వద్ద హిట్ అందుకుంది. రోజురోజుకూ కలెక్షన్లు పెంచుకుంటూ దూసుకెళ్తోంది. ప్రేక్షకుల ఆదరణే కాకుండా.. విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది.
ఇప్పుడీ చిత్రం తెలుగులో విడుదలకు సిద్ధమవుతోంది. నవంబర్ 3న తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో విడుదల కానుంది. దర్శక, నిర్మాత విధు వినోధ్ చోప్రా ఈ చిత్రాన్ని రూపొందించారు. మీర్జాపూర్ వెబ్ సిరీస్‍తో గుర్తింపు తెచ్చుకున్న విక్రాంత్ మాస్సే ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించారు. నేటి విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపేలా ఈ చిత్రం తెరకెక్కింది. 12వ తరగతి ఫెయిల్ అయిన ఓ కుర్రాడు యూపీఎస్‍సీ పరీక్షకు ప్రయత్నించడమే ఈ సినిమా ప్రధాన కథ. సివిల్స్ కోసం ప్రయత్నించే కుర్రాడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనే అంశాన్ని ప్రధానంగా చూపించారు. అనురాగ్ పాఠక్ రాసిన ‘12th ఫెయిల్’ అనే నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.
ఈ చిత్రంలో మేధా శంకర్, ప్రియాన్షు చటర్జీ, సంజయ్ బిష్ణోయ్, హరిష్ ఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు. షాంతనూ మొయిత్రా సంగీతం అందించగా రంగరాజన్ రామభద్రన్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రం నేటి యువతకు చాలా స్ఫూర్తిదాయకంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హిందీ ప్రేక్షకులు మెచ్చిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి.