సంక్రాంతి సోగ్గాళ్లు
సంక్రాంతి రేసులో ఉన్న ఏడు సినిమాల్లో ఫ్యామిలీ స్టార్ ఒక్కడే వెనక్కి తగ్గాడు. మిగతా ఆరింటిలో ఏదో ఒకటి పోస్ట్ పోన్ అవుతుంది. థియేటర్స్ సమస్య చాలా వరకు తీరుతుంది అనుకునే.. ఎవరికివారు తగ్గేదే లేదంటున్నారు. సంక్రాంతి బరిలో దిగడానికి కొందరు రాత్రింబగళ్లు కష్టపడుతున్నారు. పండక్కి రాకపోతే కెరీర్ లేదన్న ధోరణితో వున్నది ఎవరో చూసేద్దామా.
సంక్రాంతి బరిలో గుంటూరుకారం , హనుమాన్, సైంథవ్, ఈగిల్, నా సామిరంగా.. సినిమాలు ఉన్నాయి. హనుమాన్.. సైంథవ్.. ఈగిల్ షూటింగ్ పూర్తి చేసుకుని చాలా రోజులైంది. గుంటూరు కారం.. నా సామిరంగ మాత్రం రిలీజ్ డేట్ దగ్గరపడే కొద్దీ ఒకవైపు షూటింగ్.. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెంచుకుంటూ పోతున్నాయి. గుంటూరు కారంకు సంబంధించిన ఓ పాటను కేరళలో తీస్తే.. సినిమా పూర్తవుతుంది. మరోవైపు స్పీడ్‌గా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సాగుతోంది. షూటింగ్ మొదలుకాకుండానే.. నా సామిరంగ సంక్రాంతికి వస్తోందని ప్రకటించారు. సంక్రాంతి కొచ్చిన సోగ్గాడే చిన్నినాయన, బంగార్రాజు హిట్ కావడంతో.. నా సామి రంగతో సినిమా పండక్కే రావాలన్న టార్గెట్‌తో నాన్ స్టాప్‌గా నటిస్తున్నాడు నాగార్జున. ఒకవైపు షూటింగ్.. పక్కనే ఎడిటింగ్ వర్క్ నడుస్తోందట.
రిలీజ్‌కు మూడు నెలల ముందు షూటింగ్ మొదలుపెట్టి హడావుడి సినిమా పూర్తి చేయడం ఈ సంక్రాంతికే చూస్తున్నాం. ఇంత హడావుడి గతంలో ఎప్పుడూ లేదు. ప్రతి రోజూ చాలా విలువైందిగా మారిపోయింది. సినిమాను చుట్టేస్తున్నారా? అన్న అనుమానం అభిమానుల్లో మొదలైంది. మినిమం ఏడాది.. లేదంటే ఆరేడు నెలల్లో తీసే సినిమాను మూడు,నాలుగు నెలల్లో పూర్తి చేయడం అర్థం కావడం లేదు. సంక్రాంతికి వస్తే హిట్ అవుతుందన్న సెంటిమెంట్‌తో వున్న దిల్ రాజు ‘ఫ్యామిలీస్టార్’ ను తీసుకురావాలనుకున్నాడు. అయితే అమెరికా షూటింగ్ చేయాల్సి రావడం.. చిత్ర యూనిట్‌లో కొందరికి వీసాలు రాకపోవడంతో.. సినిమా 20 రోజులపాటు షూటింగ్‌కు నోచుకోలేదు. దీంతో.. తప్పని పరిస్థితుల్లో సంక్రాంతి నుంచి ఫ్యామిలీస్టార్ తప్పుకున్నాడు. ఫ్యామిలీస్టార్ సంక్రాంతికి రాకపోయినా.. ఐదు తెలుగు సినిమాలే కాకుండా.. రజనీ డబ్బింగ్ మూవీ ‘లాల్ సలాం’ రానుంది. అరడజను క్రేజీ సినిమాలకు థియేటర్స్ కావాల్సినన్ని దొరకవు. వెనక్కి తగ్గే మూవీ ఒక్కటీ లేదు. 2024 సంక్రాంతి హెవీ కాంపిటీషన్‌తో హీటెక్కిస్తోంది.