టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే.. టక్కున చెప్పే పేరు ప్రభాస్. టాలీవుడ్లో యువహీరోలు అంతా.. బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పేసి పెళ్లి చేసుకున్నారు. ఐతే 44 ఏళ్లు దాటినా.. డార్లింగ్ మాత్రం ఇంకా పెళ్లి కాని ప్రసాద్‌లానే మిగిలిపోయాడు. రెబల్ స్టార్ సై అంటే చేసుకోవడానికి ఎంతో మంది అమ్మాయిలు వెయిటింగ్లో ఉన్నా.. మనోడు మాత్రం పచ్చజెండా ఊపడం లేదు. ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అని డార్లింగ్ బంధువులు, సన్నిహితులను అడిగినా.. సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారు. ప్రభాస్ పెళ్లి ఎప్పుడా అని ఆయన ఫాన్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.
ఐతే ఇప్పుడు ఇన్‌స్టాలో ప్రభాస్ చేసిన ఓ పోస్ట్.. పెళ్లి మీద మళ్లీ చర్చకు కారణం అవుతోంది. సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ప్రభాస్ గుడ్ న్యూస్ చెప్పాడు. తన జీవితంలోకి ఓ ప్రత్యేక వ్యక్తి ప్రవేశించబోతున్నారని.. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. డార్లింగ్స్.. చివరకు నా జీవితంలోకి ఓ ప్రత్యేక వ్యక్తి ప్రవేశించబోతున్నారు. వెయిట్ చేయండి అని ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలో ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు.. ప్రభాస్ బ్యాచిలర్ లైఫ్‌కు స్వస్తి చెప్తున్నాడు అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
కాబోయే భార్యను ప్రభాస్ పరిచయం చేస్తాడా.. ఇంతకీ అమ్మాయి ఎవరు అని ఫ్యాన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వెయిట్ చేయండి అంటూ తెలుగులోనూ ప్రభాస్ స్పష్టంగా పేర్కొన్నాడు. దీనిపై క్లారిటీ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ నటించిన కల్కి సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఐతే ప్రభాస్ పెట్టిన స్టేటస్.. ఈ సినిమాకు సంబంధించి అయి ఉంటుందన్న ప్రచారం కూడా జరుగుతోంది.