Ranjitha: అత్యాచార ఆరోపణలతో దేశం నుంచి పరారైన వివాదాస్పద స్వామి నిత్యానంద.. కైలాస దేశం అని తనకు తాను ఓ దేశాన్ని క్రియేట్ చేసుకున్నారు. ప్రత్యేకమైన కరెన్సీ, ప్రత్యేకమైన విధానాలు రూపొందించుకున్నారు అవి మాములు ప్రత్యేకతలు కావు. ఓ దీవిని దేశంగా మార్చుకొని.. ఏకంగా ఐక్యరాజ్యసమితిలోనే సభ్యత్వం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు నిత్యానంద. ఐతే ఇప్పుడు ఆ దేశానికి సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
ఆ దీవికి తన ప్రియ శిష్యురాలైన మాజీ నటి రంజితను నిత్యానంద ప్రధానిగా ప్రకటించుకున్నట్లు ఓ ప్రముఖ తమిళ పత్రిక కథనం ప్రచురించింది. ఈ మేరకు నిత్యానంద వెబ్‌సైట్‌లోనూ ప్రకటించారని తెలపడం కలకలం రేపుతోంది. ఆ వెబ్‌సైట్‌లో రంజిత చిత్రం కింద నిత్యానందమయి స్వామి అనే పేరుందని, దాని దిగువనే హిందువుల కోసమే ఏర్పాటైన కైలాసదేశ ప్రధాని అని ఉందని వివరించింది. ఐక్యరాజ్యసమితి సమావేశంలో కైలాస దేశం తరఫున మహిళా రాయబారులు పాల్గొన్నారు. ఆ కోవలోనే నటి రంజిత కూడా కైలాస దేశ ప్రధానిగా త్వరలోనే ఐక్యరాజ్యసమితి సమావేశానికి హాజరైనా ఆశ్చర్యం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయ్. ఇక అటు కైలాస దేశానికి ఓ పతాకం, కరెన్సీ, రాజ్యాంగంతో పాటు. ఓ దేశానికి ఏమేం ఉండాలో అవన్నీ సమకూర్చుకున్నారు నిత్యానంద.
ఇక అటు నిత్యానందకు రంజిత ప్రియ శిష్యురాలిగా ఉంది. ఆ మధ్య రంజిత తీవ్ర వివాదాలు కూడా ఎదుర్కొన్నారు. తెలుగు, తమిళంతో పాటు మళయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ రంజిత యాక్ట్ చేసింది. మావిచిగురు, తాతా మనవడు, శుభాకాంక్షలు, శ్రీరాములయ్య సినిమాల్లో రంజిత పాత్రకు మంచి పేరు వచ్చింది. ఐతే ఇప్పుడు కైలాస దేశానికి ఆమెను ప్రధాని చేశారంటూ వస్తున్న వార్తలతో.. నిత్యానంద వ్యవహారం మరోసారి చర్చకు వస్తోంది.