రేసింగ్ లో నాగచైతన్య ఎంట్రీ హైదరాబాద్ టీమ్ ను కొన్న హీరో

  • Written By:
  • Publish Date - August 22, 2024 / 07:11 PM IST

సినిమా సెలబ్రిటీలు వ్యాపారరంగంలో అడుగుపెట్టడం రెగ్యులర్ గా జరిగేదే…తమకు ఆసక్తి, అభిరుచి ఉన్న బిజినెస్ లలో పెట్టుబడులు పెడుతూ అందులోనూ రాణిస్తుంటారు. టాలీవుడ్ హీరో అక్కినేని చైతన్య వెండితెరపైనే కాదు బిజినెస్ మ్యాన్ గానూ బిజీగా ఉంటాడు. నాగార్జున కుమారుడిగానే ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న చైతూ వ్యాపారరంగంలోనూ రాణిస్తున్నాడు. అది కూడా తనకెంతో ఇష్టమైన మోటార్ రేసింగ్ లో అడుగుపెట్టాడు. ఇండియన్ రేసింగ్ లీగ్ లో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేశాడు. దీంతో ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ ఆధ్యర్యంలో జరిగే ఫార్ములా 4 సీజన్ లో భాగం కానున్నాడు. నిజానికి చైతూకు ఫార్ములావన్ అంటే చాలా క్రేజ్. బుల్లెట్ లా దూసుకుపోయే ఈ కారు రేసింగ్ చూసేందుకు ప్రతిసారి ప్రత్యేకంగా వెళుతుంటాడు.

ఇప్పటికే చైతూ వద్ద సూపర్ కార్స్, కొత్త హై రేంజ్ స్పీడ్ మోటార్ సైకిళ్లు కూడా ఉన్నాయి. రేసింగ్ పై ఇష్టంతోనే ఫ్రాంచైజీ కొనుగోలు చేసినట్టు నాగచైతన్య చెబుతున్నాడు. ఇదిలా ఉంటే ఇండస్ట్రీకి చెందిన అక్కినేని వారసుడు తమ రేసింగ్ లీగ్ లో భాగం కావడంపై నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు. చైతూ ఎంట్రీతో లీగ్ కు మరింత క్రేజ్ పెరుగుతుందని చెబుతున్నారు. ఈ సీజన్ కు సంబంధించిన రేసులు ఈనెల 24 నుంచి మొదలుకానున్నాయి. అలాగే చెన్నై ఫార్ములా రేసింగ్ సర్క్యూట్ లో తొలిసారి నైట్ స్ట్రీట్ రేసులు జరగబోతున్నాయి. కాగా ఇండియన్ రేసింగ్ లీగ్ లో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ తో పాటు బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, గోవా, కోల్ కతా పోటీ పడుతున్నాయి. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం తండేల్ మూవీలో న‌టిస్తున్నారు. చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.