లెజండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయానికి వెళ్లారు. గర్భగుడిలోకి వెళ్తుండగా అర్చకులు, జీయర్లు అడ్డుకున్నారు. లోపలికి ప్రవేశించకూడదని వారించారు. బయటి నుంచే పూజలు చేయించి పంపేశారు. ఎందుకలా…? శ్రీవిల్లిపుత్తూరు ఆండాల్ ఆలయం విశిష్టత ఏంటి…?
శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయం… తమిళనాడులో విరుదునగర్ జిల్లాలోని శ్రీవిల్లిపుత్తూరులో ఉంది. మదురైకి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దివ్యక్షేత్రం. ఇది విష్ణువుకు అంకితం చేయబడిన 108 దివ్యదేశాలలో ఒకటి. ఆలయ గోపురం 12 అంతస్థుల్లో.. 192 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయంలో రెండు ప్రధాన సన్నిధులు ఉన్నాయి. మొదటిది వడబద్ర సాయినార్, రెండోది ఆండాళ్ సన్నిధి. ఈ ఆలయం ప్రాంగణంలో గోదాదేవి దొరికిన తులసీవనం ఇప్పటికీ భక్తులకు దర్శనమిస్తుంది. ఈ వనంలో అమ్మవారికి గుర్తుగా చిన్న మందిరాన్ని కూడా నిర్మించారు.
శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయంలో… గోదాదేవిని దర్శించుకునే కన్యలకు తప్పకుండా వివాహం జరుగుతుందని నమ్మకం. ఇక్కడ అమ్మవారిని, స్వామివార్లను తులసి దళాలతో, పూలమాలలతో సేవిస్తే ఐశ్వర్య వృద్ధి కలుగుతుందట. కోరిన కోర్కెలు సిద్ధిస్తాయని విశ్వాసం. వివాహం కాని అమ్మాయిలు ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తే వెంటనే వివాహయోగం కలుగుతుందట. ధనుర్మాసం చివరి రోజున గోదాదేవి కళ్యాణం కూడా నిర్వహిస్తారు. ఈ ఏడాది ధనుర్మాసం ప్రారంభం కావడంతో.. పెళ్లికాని యువతులు ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేసి, పెరుమాళ్ ఆలయానికి వెళ్లి, ఆండాళ్ తిరుప్పావై, నాచియార్ తిరుమొళి వంటి కీర్తనలు పాడుతున్నారు. శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయంలో కూడా ఈ పూజను ప్రత్యేకంగా జరుపుతారు. ధనుర్మాసం తొలిరోజున.. శ్రీవిల్లిపుత్తూరు ఆలయంలో ఆండాళ్, తిరుప్పావై పట్టు వస్త్రాలు ధరించి రంగమన్నార్ స్వామితో దర్శనమిచ్చారు.
లెజండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా కూడా .. ధనుర్మాసం ఆండాళ్ అమ్మవారిని దర్శించుకునేందుకు వేకువజామునే శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయానికి వెళ్లారు. అతని వెంట చినజీయర్ కూడా ఉన్నారు. స్వామివారి దర్శనం కోసం ఇళయరాజా ఆలయం ముందున్న అర్థమండపంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. కానీ… పక్కనున్న చినజీయర్, ఆలయ అర్చకులు అతన్ని అడ్డుకున్నారు. బయటే ఉండమని చెప్పారు. గర్భగుడిలోకి ప్రవేశించవద్దని చెప్పారు. ఆలయ మర్యాదకు భంగం కలగకూడదని… బయటి నుంచే స్వామివారిని దర్శించుకున్నారు ఇళయరాజా. అయితే గర్భగుడిలోకి ఇళయరాజాను రానివ్వక పోవడం కలకలం రేపింది. ఈ విషయంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు… ఎన్నో పాటలతో స్వామిని కీర్తించిన లెజండరీ సంగీత దర్శకుడికి దక్కిన గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు.