Anasuya Bharadwaj: టీవీ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి.. సినిమాల్లోకి ఎంటర్ అయి.. మంచి మంచి పాత్రలతో వరుస ఆఫర్లు సాధిస్తూ.. కెరీర్‌ను జెట్‌స్పీడ్‌లో ప్లాన్ చేసుకుంటోంది అనసూయ. పుష్పలాంటి పాన్ ఇండియా సినిమాలో ప్రధాన పాత్ర పోషించి అదరగొట్టింది. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉండే అనసూయ.. సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేసింది. స్వాతంత్ర సమరయోధురాలు బేగం హజ్రత్ మహల్ ఫోటోతో, అదే లుక్‌లో ఉన్న తన ఫోటోని కూడా అనసూయ షేర్ చేసింది.
దీంతో అనసూయ ఆమె బయోపిక్‌లో నటించబోతుందా అనే ప్రశ్న అందరిలో మొదలైంది. ఐతే ఇదేమి బయోపిక్ కాదు. ఈ ఏడాదితో మనం 76వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకను జరుపుకోబోతున్నాము. ప్రతి ఒక్కరు ఈ ఆగష్టు 15న స్వాతంత్ర సమరయోధుల త్యాగాలని గుర్తు చేసుకుంటూ ఘనంగా జరుపుకోవడానికి సిద్ధం అవుతున్నారు. అనసూయ కూడా సమరయోధులపై తనకి ఉన్న భక్తి భావాన్ని తెలియజేసింది. 1857లో సైనిక తిరుగుబాటు సమయంలో భారత స్వాతంత్ర్యోద్యమములో కీలకపాత్ర పోషించిన బేగం హజ్రత్ మహల్ గురించి ప్రతి ఒక్కరికి తెలియజేసేలా, అచ్చం ఆమెలా కనిపిస్తూ ఒక ఫోటో షేర్ చేసింది. చరిత్ర మనకి చెప్పని బేగం హజ్రత్ మహల్ కథ ఇదీ అంటూ పోస్ట్ షేర్ చేసింది. స్వాతంత్ర పోరాటం మొదలైన సమయంలో పోరాడిన మహిళా సమరయోధుల్లో బేగం హజ్రత్ ఒకరు. 1856లో బ్రిటిష్ సైనికులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆవాద్‌ను స్వాధీనం చేసుకున్న సమయంలో బేగం హజ్రత్ అవధ్.. రాష్ట్ర వ్యవహారాల బాధ్యతలు చూసుకుంటున్నారు.
ఇక ఆ సమయంలో బ్రిటిష్ సైనికులతో బేగం హజ్రత్ దళం…రాజా జైలాల్ సింగ్ నాయకత్వంలో తిరుగుబాటు చేసింది. బ్రిటిష్ నుంచి లక్నోను స్వాధీనం చేసుకున్న తరువాత తన కుమారుడైన బిర్జిస్ ఖద్రను అవధ్ పాలకుడుగా బేగం హజ్రత్ ప్రకటించారు. 1879లో ఆమె నేపాల్ రాజధాని ఖాట్మండులో మరణించారు. ఆమె పోరాట స్ఫూర్తికి గుర్తుగా భారత్ ప్రభుత్వం ఒక పోస్టల్ స్టాంప్‌ని కూడా గతంలో విడుదల చేసింది.