Vivekam: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసు ఆధారంగా తెరకెక్కిన వివేకం మూవీపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. నిందితుడిగా ఉన్న దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్ మీద న్యాయస్థానం విచారణ జరిపింది. సెన్సార్ బోర్డు అనుమతి లేకుండా వివేకం సినిమా ఎలా ప్రదర్శిస్తున్నారంటూ హైకోర్టు ప్రశ్నించింది. నియమనిబంధనలు లేకుండా సినిమాలు ప్రదర్శిస్తే.. వ్యక్తుల హక్కులకు భంగం కలగదా అని నిలదీసింది.
EC ON AP ELECTIONS: ఏపీలో ఈసీ కొరడా.. ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీ..
ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఉన్నా.. సినిమా ఎలా ప్రదర్శిస్తున్నారంటూ సీరియస్ అయింది. వివేకం సినిమాను తెలుగుదేశం స్వప్రయోజనాల కోసం వాడుతున్నారని పిటిషనర్ తరుఫు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ కోర్టు ముందు వాదించారు. సీబీఐకు ఇచ్చిన తన స్టేట్‌మెంట్ ఆధారంగా తీసిన వివేకం సినిమాలో తన పేరు వాడటంపై దస్తగిరి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేసు సీబీఐ కోర్టులో విచారణలో ఉండగా.. సినిమా ఎలా తీస్తారంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఐటీడీపీ ప్రోత్సాహంతోనే వివేకం సినిమా అన్ని ఓటీటీ వేదికల్లో ప్రదర్శిస్తున్నారంటూ పిటిషన్‌లో దస్తగిరి తెలిపాడు. పులివెందుల నుంచి తాను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని.. వివేకం సినిమా కారణంగా తన హక్కులకు భంగం కలుగుతుందని దస్తగరి పిటిషన్‌లో రాసుకొచ్చాడు.
వెంటనే సినిమాను నిలిపేసేలా ఆదేశించాలని హైకోర్టును కోరారు. పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. తక్షణమే కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం నుంచి వివరణ తీసుకోవాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. అయితే వివరణ తీసుకోవడానికి ఒక్క రోజు గడువు కావాలని న్యాయవాది కోరటంతో.. విచారణను వాయిదా వేసింది.