Actress Ranjitha: నిత్యానంద మాయలో కూతుళ్లు.. కన్నీళ్లు పెట్టుకున్న రంజిత తండ్రి, సీనియర్ నటుడు!

నిత్యానందకు, రంజితకు మధ్య ఉన్న సంబంధం గురించి వివాదాస్పద విషయాలు వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ అంశంపై తాజాగా రంజిత తండ్రి, సీనియర్ నటుడు అశోక్ కుమార్ ఒక మీడియా సంస్థతో మాట్లాడారు. రంజితతోపాటు తన మరో కూతురు కూడా నిత్యానంద దగ్గరే ఉంటున్నట్లు అశోక్ కుమార్ చెప్పారు.

  • Written By:
  • Publish Date - May 26, 2023 / 02:53 PM IST

Actress Ranjitha: వివాదాస్పద ఆధ్యాత్మిక వేత్త నిత్యానంద మాయలో పడి తన కూతుళ్లు అతడితోనే ఉంటున్నారని చెప్పుకొంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు సీనియర్ నటుడు అశోక్ కుమార్. ఆయన నటి రంజిత తండ్రి. నిత్యానందకు, రంజితకు మధ్య ఉన్న సంబంధం గురించి వివాదాస్పద విషయాలు వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ అంశంపై తాజాగా రంజిత తండ్రి, సీనియర్ నటుడు అశోక్ కుమార్ ఒక మీడియా సంస్థతో మాట్లాడారు. రంజితతోపాటు తన మరో కూతురు కూడా నిత్యానంద దగ్గరే ఉంటున్నట్లు అశోక్ కుమార్ చెప్పారు.

తన కూతుళ్లు అతడి మాయలో పడటం గురించి చెప్పుకొంటూ భావేద్వేగానికి గురయ్యారు. అశోక్ కుమార్ గతంలో గురువును మించిన శిష్యులు, బుద్ధిమంతులు వంటి చిత్రాల్లో నటించారు. అనేక చిత్రాల్లో నటించిన తర్వాత ఉన్నట్లుండి సినిమాలకు దూరమయ్యారు. ఆయనకు ముగ్గురు కూతుళ్లు కాగా, అందులో ఇద్దరు నిత్యానందతో ఉంటున్నారు. వారిలో రంజిత ఒకరు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన జీవితానికి సంబంధించిన విషయాల్ని అశోక్ కుమార్ వెల్లడించారు. “నాకు ముగ్గురు కూతుళ్లు. మంచి చదువులు చెప్పించా. వారికి పెళ్లిళ్లు చేశా. కానీ, ఇద్దరు విడాకులు తీసుకున్నారు. రెండో కూతురు రంజితకు స్వామి నిత్యానందతో పెళ్లి జరిగిందని ప్రచారమైంది. అది నిజమో.. కాదో తెలియదు. కానీ, వాళ్లిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలు మాత్రం అప్పట్లో విడుదలయ్యాయి. దీంతో కోపంతో ఒకరోజు నిత్యానంద దగ్గరికి వెళ్లాను. నీకు సిగ్గు అనిపించడం లేదా? నా కూతురును నీ ఆశ్రమం నుంచి వెనక్కు పంపించు అని నిలదీశా.

కానీ, నా ఆవేదనను అర్థం చేసుకుని, నాకు మద్దతిచ్చిన వాళ్లే లేరు. నిత్యానంద వల్లే నా కూతురు తన భర్తకు విడాకులిచ్చింది. రంజితతోపాటు మరో కూతురు కూడా నిత్యానంద మాయలో పడింది. చివరకు ఇద్దరూ అతడితోనే వెళ్లిపోయారు. ఇంకా అతడి దగ్గరే ఉంటున్నారు. వాళ్లు ఎలా ఉన్నారో తెలీదు. ఇద్దరూ ఇప్పటివరకు నాకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. ఈ పరిస్థితులు చూసి నా భార్య తట్టుకోలేకపోయింది. అనారోగ్యానికి గురై మరణించింది. ఒంటరిగా ఉన్న నన్ను చిన్న కూతురే చూసుకుంటోంది” అంటూ అశోక్ కుమార్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇదే ఇంటర్వ్యూలో అశోక్ కుమార్ తన సినీ కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి కూడా చెప్పుకొచ్చారు. “మొదట్లో నేను పోలీసుగా పని చేశా. తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి, హైదరాబాద్‌లో హోటల్ పెట్టుకున్నా. ఆ హోటల్ నష్టాల్లో ఉండటంతో అక్కడికి వెళ్లేవాడినే కాదు. ఆ హోటల్ ఇంకా దివాళా తీయడంతో మా బావ ఆ హోటల్ చూసుకున్నారు.

తర్వాత నేను ఖాళీగా ఉండటం దేనికని మద్రాసు వెళ్లి, సహాయ నటుడిగా, విలన్‌గా సినిమాలు చేశా. ఒకసారి రామానాయుడు నేను హీరోగా సినిమా తీస్తానన్నారు. కానీ, అక్కినేని నాగేశ్వర రావు జోక్యంతో నన్ను తీసేసి జగ్గయ్యతో సినిమా తీశారు. సినిమా పరిశ్రమలో ఇలాంటి అనేక ఘటనలు జరగడంతో నా ఆత్మాభిమానం దెబ్బతింది. దీంతో సినిమా ఇండస్ట్రీ నాకు సరిపోదని భావించి సినిమాలు చేయడం మానేశా” అన్నారు. తన పెళ్లి ఇష్టం లేకుండానే జరిగిందని, నచ్చని వ్యక్తిని పెళ్లి చేసుకున్నాననే కారణంతోనే ఉద్యోగానికి రాజీనామా చేశానని చెప్పారు. అయితే, తర్వాత తప్పు తెలుసుకున్నానని, తన వల్ల భార్య బాధపడుతోందని మద్రాసు తీసుకొచ్చినట్లు చెప్పారు. ఆ తర్వాత కొంతకాలానికి వారికి ముగ్గురు ఆడపిల్లల జన్మించారు. ఇక.. ఇండియా నుంచి పారిపోయిన నిత్యానంద కైలాస అనే స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనికి ఐరాస మాత్రం దేశంగా గుర్తింపు ఇవ్వలేదు.