డబ్బెక్కువైతే ఐస్ క్రీమ్ కప్పులోనే కూర్చుని ఐస్ క్రీమ్ తినేవాళ్లన్నారు. అలాంటి జబ్బే డైరెక్టర్ శంకర్ కి ఉందా అన్న అనుమానాలు పెరిగాయి. అదేదో మూవీలో ఆస్ట్రేలియాలో బీచ్ సెట్టేద్దాం అన్నట్టు, శంకర్ కూడా భారతీయుడు 2 లో ఒక్క సీన్ కోసం అనవసరంగా కోట్లు ఖర్చు చేయించాడట.
కమల్ హాసన్ తో శంకర్ తీస్తున్న మూవీ భారతీయుడు 2. ఈ సినిమాలో ఏయిర్ పోర్ట్ సీన్ కోసం ఎకంగా చెన్నై ఏయిర్ పోర్ట్ అథారిటీకి కోటిన్నర కట్టాల్సి వచ్చిందట. అసలే 200 కోట్ల బడ్జెట్ ని 350 కోట్లకు తీసుకెళ్లాడని నిర్మాతలు ఈ దర్శకుడి మీద కేసులేయటం, షూటింగ్ ఆగటం, తర్వాత కోర్టు జోక్యంతో షూటింగ్ షురూ అవటం జరిగింది. అలాంటిది మళ్లీ శంకర్ చిన్నా చితకా సీన్స్ కి కోట్లు తగలేయటం నిర్మాతలకు పుండు మీద కారం చల్లినట్టౌతోందట.
భారతీయుడు 2 లో కేవలం ఏయిర్ పోర్ట్ తాలూకు ఒక్క సీన్ కోసం కోటిన్నర కట్టేకంటే గ్రీన్ మ్యాట్ లోనో, సెట్లోనే ఆ సీన్ తీస్తే కనీసం 50 లక్షలు మిగులుతాయికదా అని కామెంట్లు పేలుతున్నాయి. సరే ఒక సారి అలా అయ్యిందంటే పర్లేదు కాని, ఈ మూవీలో ఇలాంటి సీన్లు 12 కి పైనే ఉన్నాయట. వాటికోసం కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందట. అక్కడే మళ్లీ నిర్మాతలతో శంకర్ కి వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. ఫలితంగా భారతీయుడు 2 కొత్త షెడ్యూల్ డైలామాలో పడిందట. ఈ గ్యాప్ లోనే గేమ్ ఛేంజర్ తీస్తే బెటర్ అని పెండింగ్ షూటింగ్ కోసం చరణ్ ని శంకర్ అలర్ట్ చేసినట్టు తెలుస్తోంది.