పాన్ ఇండియా సినిమాల పేరుతో అన్ని భాషల సినిమాలు అన్ని భాషల్లో విడుదల అవుతూనే ఉన్నాయి. మన తెలుగు సినిమాలను జాతీయ స్థాయిలో అన్ని ప్రముఖ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇక ఇతర భాషల సినిమాలు విడుదల కావడానికి కూడా తెలుగులో అవకాశం కల్పిస్తున్నారు. ఇక్కడ ప్రమోషన్స్ చేసినా కూడా మీడియా నుంచి మంచి ప్రాధాన్యత ఉంటుంది. వాళ్ళ సినిమాలకు సంబంధించి మన హీరోలు కూడా హడావుడి చేస్తూ ఉంటారు. మార్కెట్ పెంచుకోవడానికి అలా చేయడంలో తప్పు లేదు.
కాని ఇతర భాషల్లో వచ్చిన సినిమాలను గౌరవించాల్సిన అవసరం కూడా ఉంది. ఈ విషయంలో తమిళనాడు థియేటర్ యాజమాన్యాలు మాత్రం అహం ప్రదర్శిస్తున్నాయి. అక్కడి హీరోల సినిమాలు చిన్నవి అయినా పెద్దవి అయినా మన తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ఇస్తున్నారు. వేట్టాయన్, అమరన్ ఇలా ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలకు థియేటర్లు దొరికాయి. దేవర లాంటి పెద్ద సినిమా ఉన్నా సరే తమిళ సినిమాకు స్పేస్ ఇచ్చారు. కాని మన టాలీవుడ్ సినిమాలకు మాత్రం అక్కడ గుర్తింపు ఉండటం లేదు. థియేటర్లు ఇవ్వడానికి ససేమీరా అంటున్నారు.
ఇటీవల కిరణ్ అబ్బవరం నటించిన క సినిమా సూపర్ హిట్ అయింది. సినిమా కాన్సెప్ట్ చాలా బాగుంది అని విమర్శకులు కూడా ప్రసంశలు కురిపించారు. కాని కిరణ్ ఎంత బ్రతిమిలాడినా తమిళ థియేటర్ యాజమాన్యాలు మాత్రం ఒక్క హాల్ ఇవ్వడానికి కూడా అంగీకరించలేదు. దీనితో తమిళనాడులో సినిమా విడుదల చేయలేదు. గత పదేళ్ళలో ఎన్నో తమిళ సినిమాలు విడుదలై ఉంటాయి. కాని ఎప్పుడూ తెలుగులో అంత అహం చూపించలేదు. అక్కడి హీరోల పేరు తెలియకపోయినా సినిమాలు రిలీజ్ అయ్యాయి ఇక్కడ.
కాని కిరణ్ అబ్బవరం సినిమాకు థియేటర్లు ఇవ్వకపోవడం ఘోర అవమానమే. ఈ వైఖరి చూసిన టాలీవుడ్ జనాలు… వాళ్లకు ఎన్టీఆర్ కరెక్ట్ అంటున్నారు. దేవర సినిమాను తెలుగులో పెద్ద ఎత్తున రిలీజ్ చేసారు. ఆ టైం లో విజయ్ ఆంటోని నటించిన సినిమా కూడా రిలీజ్ అయింది. మెజారిటీ థియేటర్లు అన్నీ దేవర సినిమానే ఆడించాయి. కాబట్టి తెలుగులో ఆ సినిమా విడుదల వాయిదా పడింది. ఇతర తమిళ సినిమాలకు కూడా అలాగే చేయాలని డిమాండ్ లు వస్తున్నాయి. క సినిమా మొదటి రోజు 6 కోట్ల రూపాయలు వసూలు చేసి సంచలనం సృష్టించింది. కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే మంచి ఓపెనింగ్స్ ఆ సినిమా. ఇక్కడ కామెడి ఏంటీ అంటే… హైదరాబాద్ లో కూడా క సినిమాకు థియేటర్లు దొరకలేదు. లక్కీ భాస్కర్ సినిమాకు 327 షోస్ ఇవ్వగా… అమరన్ కు తెలుగులో 273 షోస్ ఇచ్చారు. హిందీ సినిమా భూల్ భులాయా 3కి 195 షోస్ ఇస్తే క సినిమాకు కేవలం 148 షోస్ ఇచ్చారు.