సార్వత్రిక ఎన్నికల (General Elections) హడావుడి మొదలైంది. తాజాగా ఎన్నికల సంఘం పోలింగ్ తేదీలను కూడా ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఏడు దశల్లో పోలింగ్ జరగనుండగా.. మే 13న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పోలింగ్ జరగనుంది. ఇదే ఇప్పుడు ‘కల్కి 2898 AD’ కొంపముంచనుంది.
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD). భారతీయ పురాణాల ఆధారంగా రూపొందుతోన్న ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమాని మే 9న విడుదల చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. అయితే వీఎఫ్ఎక్స్ వర్క్ తో ముడిపడిన భారీ సినిమా కావడంతో.. ఆ తేదికి నిజంగానే విడుదలవుతుందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పుడు ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఈ సినిమా వాయిదా పడటం దాదాపు ఖాయమే. వీఎఫ్ఎక్స్ వర్క్ అనుకున్న సమయానికి పూర్తయ్యి, అవుట్ పుట్ రెడీ అయినా.. మే 13న సినిమాని విడుదల చేయలేని పరిస్థితి ఏర్పడింది.
ఎన్నికల హడావుడి మొదలైందంటే జనాలు పెద్దగా సినిమాలను పట్టించుకునే పరిస్థితి ఉండదు. పైగా ‘కల్కి 2898 AD’ లాంటి బిగ్ బడ్జెట్ సినిమాలకు భారీ ఓపెనింగ్స్ తో పాటు లాంగ్ రన్ కూడా ముఖ్యమే. మొండిగా ఎన్నికల సమయంలో సినిమాని విడుదల చేస్తే వసూళ్లపై తీవ్ర ప్రభావం పడి, భారీ నష్టాలను చూడాల్సి వస్తుంది. కాబట్టి మేకర్స్ సినిమాని వాయిదా వేసే అవకాశముంది. ప్రభాస్ సినిమా అంటే దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తారు. పైగా ‘కల్కి’ని పాన్ వరల్డ్ సినిమాగా విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అందుకే మన దేశంలో ఎన్నికలు ముగిశాక.. సరైన తేదీని చూసి ‘కల్కి’ని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.