Bigg Boss 7: బిగ్‌బాస్.. తెలుగు జనాలకు పరిచయం అవసరం లేని టీవీ షో. గంభీరమైన వాయిస్.. గమ్మత్తైన టాస్కులు.. అదుర్స్ అనిపిస్తుంటుంది షో. తిట్టుకునేవాళ్లు, పొగిడేవాళ్లు.. ఇష్టపడేవాళ్లు, కష్టం అనుకునేవాళ్లు.. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా.. సాయంత్రం అయ్యే సరికి ఇంట్లో బిగ్‌బాస్ గొంతు వినిపించాల్సిందే. బిగ్‌బాస్ సీజన్7కు చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. అన్నపూర్ణలో ఇప్పటికే హౌస్ రెనవేషన్ మొదలైంది. కంటెస్టెంట్స్ కూడా దాదాపు ఫైనల్ అయ్యారు.
త్వరలో వారందరికీ పిలుపు రాబోతోంది. షో స్టార్ట్ కావడానికి ఇంకొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. సెప్టెంబర్ 3న గ్రాండ్‌గా షో స్టార్ట్ కాబోతోంది. కంటెస్టెంట్ల ఎంపిక సరిగాలేకపోవడం వల్ల గత సీజన్లు.. తుస్సుమనిపించాయి. దీంతో ఈసారి ఆ తప్పులు జరగకుండా బిగ్‌బాస్ టీమ్.. చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటివరకు చాలామంది కంటెస్టెంట్లను ప్రేక్షకులకు బాగా తెలిసినవారినే ఎంపిక చేశారని తెలుస్తోంది. అందులో భాగంగా ఎవరూ ఊహించని ఇద్దరి పేర్లు కొత్తగా తెరపైకి వచ్చాయి. హీరో అబ్బాస్, హీరోయిన్ ఫర్జానా.. ఇద్దరూ కూడా బిగ్‌బాస్ ఇంట్లోకి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రేమదేశం సినిమాతో తెలుగువారికి పరిచయం అయిన అబ్బాస్‌కు ఇక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కొన్ని సినిమాల తర్వాత తన నటనకు గుడ్‌బై చెప్పి ఫ్యామిలీతో న్యూజిలాండ్‌కు వెళ్లిపోయాడు. ఇప్పుడు కుటుంబంతో సహా మళ్లీ ఇండియాకు తిరిగొచ్చాడు. సినిమా అవకాశాలు వస్తే నటిస్తానని అంటున్నాడు.
అందులో భాగంగానే ఆయన బిగ్‌బాస్‌కు వెళ్లాలని ఫిక్స్ అయ్యాడట. ఆయనతో పాటు హీరోయిన్ ఫర్జానా ఎంట్రీ కూడా దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. భాగ్యలక్ష్మి బంపర్ డ్రా సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయింది ఈ ముంబై బ్యూటీ. సీమశాస్త్రి, బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్, 1977, కుబేరులు వంటి చిత్రాల్లో నటించింది. 2009 తర్వాత నుంచి టాలీవుడ్‌కు దూరంగా ఉంది. ఇప్పుడు బిగ్‌బాస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వాలనే ప్లాన్‌లో ఉందని తెలుస్తోంది. ఫర్జానాలో ఉన్న మరో టాలెంట్ డ్యాన్స్. బాలీవుడ్‌లో పలు ప్రైవేట్ ఆల్బమ్స్‌కు కొరియోగ్రాఫర్‌గా పనిచేసింది. ఈ ఇద్దరు హౌస్‌లో అడుగు పెడితే.. బిగ్‌బాస్‌కు మరింత గ్లామర్ యాడ్ అయినట్లే..!