బుక్ మైషో సీఈఓ, సహ వ్యవస్థాపకుడు ఆశిష్ హేమ్ రజనీ, కంపెనీ టెక్నికల్ హెడ్ కు సమన్లు జారీ చేసారు. బ్రిటిష్ రాక్ బ్యాండ్ కోల్డ్ ప్లే కచేరీ టిక్కెట్ లను బ్లాక్ మార్కెటింగ్ చేసినట్లు ఆరోపణలపై తాజాగా సమన్లు జారీ చేసారు. గత శనివారం వారిని విచారణకు పిలిచిన ముంబై పోలీసు ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) ఇప్పుడు విచారణ అధికారి ఎదుట హాజరు కావాలని కోరింది. అయితే వీరిద్దరు పోలీసులతో టచ్‌లో లేరని సమాచారం. వచ్చే ఏడాది జనవరి 19 నుంచి 21 వరకు నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరిగే కోల్డ్ ప్లే కచేరీకి టిక్కెట్ లు బ్లాక్ మార్కెటింగ్‌కు బుక్ మై షో… కారణమని అమిత్ వ్యాస్ అనే న్యాయవాది ఫిర్యాదుపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
కోల్డ్ ప్లే ఇండియా టూర్ టిక్కెట్‌లను వాస్తవానికి రూ 2,500గా నిర్ణయించారని, వాటిని థర్డ్ పార్టీలు, ఇన్ ఫ్లుయెన్సర్ లు రూ.3 లక్షలకు తిరిగి విక్రయిస్తున్నారని వ్యాస్ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు ఇప్పటికే శ్రీ వ్యాస్ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. అలాగే టికెట్ స్కాపింగ్‌లో పాల్గొన్న పలువురు బ్రోకర్లను గుర్తించారు. సెప్టెంబర్ 22న కోల్డ్ ప్లే ఇండియా షో టిక్కెట్‌ల ఓపెన్ చేసిన తర్వాత బుక్ మై షో యాప్ క్రాష్ అయింది. ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఇండియాలో బ్రిటిష్ రాక్ బ్యాండ్ షో నిర్వహిస్తోంది. దీనిపై మాట్లాడిన బుక్‌మైషో… బ్లాక్ మార్కెట్ లో టికెట్ లు విక్రయించే ఫ్లాట్ ఫాంస్ తో తమకు సంబంధం లేదని పేర్కొంది.
అభిమానులకు టికెట్ లు అందించడానికి అన్ని ఏర్పాట్లు చేసామని బుక్ మై షో పేర్కొంది. ఇప్పటి వరకు 13 మిలియన్ల మంది ఈ షో టికెట్ లను కొనుగోలు చేసారు. బ్లాక్ మార్కెటింగ్ చేసే విధానాన్ని BookMyShow వ్యతిరేకిస్తోందని, కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసిందని ప్రతినిధి తెలిపారు. అధిక డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని టికెట్ ల విక్రయానికి క్యూయింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేసినట్లు కంపెనీ తెలిపింది. దీని కారణంగానే కాస్త ఆలస్యం జరిగినట్లు కంపెనీ ప్రతినిధులు పోలీసులకు తెలిపారు.