దేవర సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ… అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ సినిమా విడుదల కావడం, అలాగే విదేశాల్లో భారీ మార్కెట్ జరగడం, సినిమా కోసం ఎన్టీఆర్ రెండేళ్ళ పాటు కష్టపడటం అన్నీ కూడా ఫ్యాన్స్ లో క్రేజ్ పెంచుతున్నాయి. ఇక వసూళ్లు ఏ రేంజ్ లో ఉంటాయో అనే ఆసక్తి కూడా ఉంది. ఇప్పటి వరకు విదేశాల్లో మాత్రమే ప్రీ బుకింగ్ మొదలయింది. త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రీ బుకింగ్ మార్కెట్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు కూడా భారీగా ఎదురు చూస్తున్నారు.
తెలంగాణాలో దేవర సినిమా టికెట్ ధరలపై క్లారిటీ రావాల్సి ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఏపీలో ‘దేవర’ సినిమా టికెట్ల ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మల్టీప్లెక్స్‌లలో ఒక్కో టికెట్లపై రూ.135 వరకు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ ఒక్కో టికెట్ పై రూ.110, లోయర్ క్లాస్ ఒక్కో టికెట్‌పై రూ.60 వరకు పెంచుకోవడానికి అనుమతి ఇస్తున్నట్టు ప్రకటించింది. సినిమా రిలీజ్ రోజున (SEP 27) తెల్లవారుజామున 12నుంచి మొత్తం 6షోలకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.
28వ తేదీ నుంచి 9 రోజుల పాటు రోజుకు 5షోల ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం నిర్వహిస్తుంది చిత్ర యూనిట్. దీని కోసం ప్రముఖులను ఆహ్వానించే ప్లాన్ చేసింది. నందమూరి బాలకృష్ణ కూడా హాజరు అయ్యే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. అయితే బాలయ్య నుంచి మాత్రం స్పష్టత రాలేదు. రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ సహా పలువురు హాజరు అయ్యే అవకాశం ఉంది. అలాగే బాలీవుడ్ నుంచి కూడా ప్రముఖులను ఆహ్వానిస్తోంది చిత్ర యూనిట్. కాగా ఈ నెల 27 న ఈ సినిమా విడుదల కానుంది. విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు.