తెలంగాణలో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల దగ్గర సెలబ్రిటీలు, సినిమా ప్రముఖులు ఓట్లు వేసేందుకు క్యూ కట్టారు. సనత్ నగర్ లోని నారాయణ కాలేజ్ పోలింగ్ బూత్ దగ్గర CEO వికాస్ రాజు కుటుంబ సభ్యులతో వచ్చి ఓట్లు వేశారు. తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ తన ఓటును అంబర్ పేటలోని GHMC స్పోర్ట్స్ కాంప్లెక్స్ బూత్ దగ్గర వినియోగించుకున్నారు. అంబర్ పేటలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దంపతులు ఓట్లు వేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. బంజారాహిల్స్ లోని DAV స్కూల్లో ఓటు వేశారు ఎమ్మెల్సీ కవిత. రాష్ట్రంలో పింక్ వేవ్ నడుస్తోందని ఆమె కామెంట్ చేశారు. ఇది వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఈసీకి కంప్లయింట్ చేసింది. షేక్ పేట ఇంటర్నేషనల్ స్కూల్లో సతీమణి రమతో కలసి ఓటు వేశారు ప్రముఖ దర్శకుడు రాజమౌళి. జూబ్లీహిల్స్ పోలింగ్ బూత్ లో సతీసమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. జూబ్లీహిల్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ ఓటు వేశారు. మీరు ఓట్లు వేయరా అని మీడియా ప్రతినిధులను జూనియర్ ఎన్టీఆర్ ప్రశ్నించారు. జూనియర్ వెంట ఆయన భార్య లక్ష్మీ ప్రణతి, తల్లి షాలిని ఉన్నారు. వీరితో పాటు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కుటుంబసభ్యులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా జూబ్లీహిల్స్ లోనే ఓటేశారు. మణికొండలో ఓటు హక్కు వినియోగించుకున్నారు దర్శకుడు తేజ, నటుడు వెంకటేష్. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో కుటుంబ సభ్యులతో కలసి ఓటు హక్కు వినియోగించుకున్నారు నటుడు శ్రీకాంత్. ప్రజలంతా విధిగా ఓటు వేయాలని కోరారు. పద్మారావునగర్ లోని తుంగభద్ర మహిళా సంఘంలో పోలింగ్ బూత్ 85 లో ఓటు హక్కు వినియోగించుకున్నారు సినీ దర్శకుడు శేఖర్ కమ్ముల. హాలిడే అని ఇంట్లో కూర్చోకుండా ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు వేయాలని కోరారు. ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలన్నారు.