Chiranjeevi: పిచ్చుకమీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి..? ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి సెటైర్లు..!

వైసీపీ ప్రభుత్వానికి పరోక్షంగా చురకలు అంటించారు. పిచ్చుకమీద బ్రహ్మాస్త్రంలా సినిమా పరిశ్రమపై పడతారేంటి అంటూ ఘాటుగా స్పందించారు. కొంతకాలంగా ఏపీలోని వైసీపీ ప్రభుత్వం సినీ పరిశ్రమను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతోంది. అదనపు షోలకు అనుమతివ్వడం లేదు.

  • Written By:
  • Publish Date - August 8, 2023 / 03:25 PM IST

Chiranjeevi: సినిమా పరిశ్రమపై ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షసాధింపు వైఖరిపై మెగాస్టార్ చిరంజీవి విమర్శలు చేశారు. ప్రభుత్వానికి పరోక్షంగా చురకలు అంటించారు. పిచ్చుకమీద బ్రహ్మాస్త్రంలా సినిమా పరిశ్రమపై పడతారేంటి అంటూ ఘాటుగా స్పందించారు. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మూవీ గత సంక్రాంతికి విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వేడుకలో చిరంజీవి మాట్లాడారు. “మీలాంటివాళ్లు ప్రత్యేక హోదా గురించి, రోడ్ల నిర్మాణం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ప్రాజెక్టుల గురించి ఆలోచించాలి. పేదవారి కడుపు నింపే దిశగా ఆలోచించాలి. అలా చేస్తే అందరూ మీకు తలవంచి నమస్కరిస్తారు. అంతేకానీ.. పిచ్చుకమీద బ్రహ్మాస్త్రంలా సినిమా పరిశ్రమపై పడతారేంటి..?” అంటూ వ్యాఖ్యానించారు. ఇది ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే అని అర్థమవుతోంది.

టిక్కెట్ల ధరలు తగ్గించిన వైసీపీ ప్రభుత్వం
కొంతకాలంగా ఏపీలోని వైసీపీ ప్రభుత్వం సినీ పరిశ్రమను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతోంది. అదనపు షోలకు అనుమతివ్వడం లేదు. టిక్కెట్ల ధరలు పెంచుకునేందుకు కూడా అనుమతించడం లేదు. అంతేకాదు.. టిక్కెట్ల ధరలను విపరీతంగా తగ్గించింది. పది రూపాయలకే టిక్కెట్ ధర నిర్ణయించింది. ఏదైనా ధరల పెంపు కావాలంటే.. రాజకీయ కోణంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయింది. టిక్కెట్ల ధరలు తగ్గడంతో థియేటర్ల యజమానులకు కరెంట్ బిల్లులకు సరిపడా కూడా ఆదాయం రాని పరిస్థితి నెలకొంది. దీనిపై సినిమా పరిశ్రమ నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. చివరకు చిరంజీవితోపాటు రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి, కొరటాల శివ వంటి సినీ ప్రముఖులు వెళ్లి సీఎంను కలిసి విజ్ఞప్తి చేస్తేగానీ.. స్వల్పంగా ధర పెంచలేదు. ఇప్పటికీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో టిక్కెట్ల ధరలు చాలా తక్కువగానే ఉంది. దీంతో కొంతకాలంగా ఏపీలో సినిమా పరిశ్రమకు ఆదాయం తగ్గింది.
చిరంజీవి ఎందుకు స్పందించారు..?
టిక్కెట్ల ధరల పెంపుదలపై సీఎంను కలిసిన సినీ బృందానికి చిరంజీవి నాయకత్వం వహించారు. చిరంజీవి భేటీ తర్వాత ప్రభుత్వం కాస్త కరుణించినట్లుగా స్వల్పంగా టిక్కెట్ల ధరల పెరుగుదలకు అంగీకరించింది. అయితే, ప్రభుత్వం వైఖరిపై చిరంజీవి ఇన్నాళ్లకు స్పందించడం సంచలనంగా మారింది. ఇప్పటికీ ఏపీలో పరిశ్రమకు ఇబ్బందులున్నాయి. కొన్ని సినిమాల టిక్కెట్ల ధరల పెంపునకు, అదనపు షోలకు అనుమతించడం లేదు. వైసీపీ ప్రభుత్వం సినిమాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టినట్లు కనిపిస్తోంది. గతంలో ప్రభుత్వ అధికారులను థియేటర్ల దగ్గర కాపలా ఉంచడం కూడా విమర్శలకు దారితీసింది. ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా పెట్టుబడులపై మంత్రి అంబటి రాంబాబు ఏకంగా ఢిల్లీ వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఇలా అనేక రకాలుగా సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తుండటంపై చిరంజీవి అసహనానికి గురైనట్లు కనిపిస్తోంది. వీటన్నింటి కారణంగా చిరంజీవి స్పందించినట్లు కనిపిస్తోంది. నిజానికి చిరంజీవి ఎప్పుడూ రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయరు. సినిమా వేడుకలో సినిమాల గురించే మాట్లాడుతారు. గతంలో వివిధ అంశాలపై ప్రభుత్వానికి మర్యాదపూర్వకంగానే అడిగారు. ఈసారి కూడా చిరు.. తనదైన శైలిలోనే విమర్శలు గుప్పించారు. కానీ, ఇది ప్రభుత్వానికి విమర్శగా అనిపించొచ్చు.
స్పందించిన కొడాలి నాని
జగన్‌ ప్రభుత్వంపై ఎవరైనా విమర్శలు చేస్తే వెంటనే స్పందించే వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని చిరంజీవి వ్యాఖ్యలపై స్పందించారు. సినీ ఇండస్ట్రీలో చాలా మంది పకోడీ గాళ్లున్నారని, ప్రభుత్వం ఎలా ఉండాలో కూడా వారు సలహా ఇస్తున్నారంటూ మండిపడ్డారు. అలాంటి పకోడీ గాళ్లు సలహాలు తనవాళ్లకు ఇచ్చుకోవచ్చు కదా అంటూ విమర్శించారు. కొడాలి వ్యాఖ్యల్ని వైసీపీ శ్రేణుల్ని సమర్ధిస్తుంటే, మెగా ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు. కొద్దిరోజులపాటు చిరంజీవి వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగడం ఖాయం. మరోవైపు చిరంజీవి నటించిన భోళా శంకర్ ఈ శుక్రవారమే విడుదల కానుంది. ఈ చిత్ర విడుదలపై చిరు వ్యాఖ్యల ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందేమో చూడాలి.