మెగా స్టార్ నాలుగో సారి తాత అయినందుకు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.ఇండియా లో ట్రేండింగ్ టాపిక్ కూడా ఇదేనట. అంత బాగానే ఉంది. కాకపోతే ఈ చిల్లర కల్చర్ చూసి చాలా బాధ వేస్తుంది. మనం ప్రజాస్వామ్యం లో ఉన్నాం. రాజరికం లో కాదు.దయచేసి ఆ విషయం మర్చిపోకండి. అభిమానం వెర్రి తలలు వేసి.. అభిమాన హీరో కి కూతురు.. మనమరాలు.. పుడితే పండగ చేసుకునే స్థాయి కి దిగజారింది. మన పిల్లలు పుట్టినప్పుడు.. మన ఇంట్లో కొత్త తరం వచ్చినప్పుడు..ఈ హడావిడి చేయండి. కానీ ఇదేమి పిచ్చి..? పూర్వం రాజులు.. చక్రవర్తులకు సంతానం కలిగితే ఇలా రాజ్యమంతా వేడుకలు జరిగేవట. కథల్లో చదివాము. ఇప్పుడు మళ్లీ చూస్తున్నాం.
ఇదేదో అసూయ తోనో.. ఈర్ష్య తోనో చెప్తున్నది కాదు. ఆలోచనతో,ఆవేదన తో గొంతు చించుకుంటన్న విషయం.సెలెబ్రెటీల అంతర్గత వ్యవహారాలపై జనానికి సహజంగానే ఆసక్తి ఉంటుంది. అంత మాత్రాన కుటుంబ వ్యవహారాన్ని పబ్లిక్ ఇష్యూగా మార్చేయడం ఎంత వరకు సమంజసం.? దేశంలో ఎవరికి పిల్లలు పుట్టరా.. పుట్టడం లేదా.. పోనీ గతం లో తెలుగు హీరోలకు ఎవరికి పిల్లలు పుట్టలేదా? ఇదేమి విచిత్రం? సహజంగా అన్ని విషయాల్లో చాలా పద్దతిగా గౌరవంగా వ్యవహరించే చిరంజీవి ఎందుకో ఇక్కడ దారి తప్పారు.చిరంజీవి ప్రెస్ మీట్ పెట్టి మరీ.. నాకు మనమరాలు పుట్టిందని ప్రకటించడం చికాకు తేప్పిస్తుంది. నిజానికి వారం ముందే రాంచరణ్ ,ఉపాసన ప్రమోషన్ టీమ్ ఈ డెలివరీకి భారీగా ప్రచారం ప్రారంభించారు. వీడియోలు వదిలారు.
గర్భవతి గా ఉన్నప్పటి నుంచి కాన్పుకి హాస్పిటల్ కి వెళ్ళేవరకు వీడియోలు సర్క్యూలేట్ అవుతూనే ఉన్నాయి.డెలివరీ కి ముందు రోజు మెసేజెస్ పెట్టారు. 6 గంటలకి మీడియా వాళ్ళు అందరూ రావాలని ముందే చెప్పారు. లైవ్ లతో సిద్ధంగా ఉండాలని అలెర్ట్ చేశారు. అదేదో బిజినెస్ సమ్మిట్ కి పిలిచినట్లు బిల్డుప్ ఇచ్చారు. వెబ్ సైట్స్ లో.. సోషల్ మీడియాలో హంగామా అంతా ఇంతా కాదు. ఇదంతా చూసి చాలా మంది నవ్వు కుంటున్నారు. అల్లు అర్జున్.. మహేష్ బాబు.. జూనియర్ ఎన్టీఆర్ కి పిల్లలు పుట్టినప్పుడు.. హాస్పిటల్స్ లో ఇంత హడావుడి ఎందుకు జరగలేదో అర్థం కావడం లేదు. పోనీ చిరంజీవి కి పిల్లలు పుట్టినప్పుడు హడావుడి జరిగిందా అదీ లేదు. పిల్లలు పుట్టడం అనేది పూర్తిగా కుటుంబ ప్రైవేట్ వ్యవహారం. దానిని ఇంత సోషల్ ఎందుకు చేశారో.. చిరంజీవి దీనిని ఎందుకు అడ్డుకోలేక పోయారో అర్థం కాదు.
పవన్ కళ్యాణ్ కి రెయిన్బో ఆసుపత్రి లో పిల్లలు పుట్టినప్పుడు ఇంత హంగామా జరగలేదు. ఆయన ఇలాంటివి అస్సలు ఇష్టపడడు.ఇప్పుడు తెలుగునాట కొత్త సంస్కృతి కి చిరంజీవి తెర తీశారు. డెలివరీ కి ముందే హాస్పిటల్ బయట ఫాన్స్ హంగామా.. ఏమిటిది? రాంచరణ్ ప్రమోషల్ ఆక్టివిటీ గడచిన 3 ఏళ్లుగా విస్తృతంగా జరుగుతుంది. రాంచరణ్ పెర్సనల్ ప్రమోషనల్ టీమ్ చెర్రీ ప్రతి అడుగుని రికార్డ్ చేసి జనంలోకి వదిలి అతని బ్రాండ్ ఇమేజ్ పెంచే పని లో ఉన్నారు. RRR సాంగ్ కి ఆస్కార్ వచ్చినప్పుడు ఇంటర్వ్యూ లు.. రాంచరణ్ ఇండియా టు డే ఎనక్లేవ్ లో పాల్గొనడం.. ఆ తరవాత G 20 సమ్మిట్ కి హాజరవ్వడం.. ఇదంతా బ్రాండ్ ఇమేజ్ పెంచే పనిలో భాగమే. కానీ చెర్రీకి కూతురు పుట్టినప్పుడు కూడా ఇలా ప్రమోషన్ చేయడం ఏమిటి? పెళ్లయి 11 ఏళ్లకి ఉపాసన తల్లి కావడం ఒక ఎమోషన్. అది కుటుంబానికి పరిమితం అయితే బాగుండేది. కానీ సినిమా ప్రమోషన్ లా చేయడమే విచిత్రం అనిపించింది.
అమితాబ్ బచ్చన్ కూడా ఇంత ఎప్పుడు చేయలేదు. అభిమానులు.. మీడియా వాళ్ళు ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి. చిరంజీవి కి మనమరాలు పుడితే హంగామా అందరూ ఇంత హంగామా చేశారు.. మన కుటుంబాల్లో పిల్లలు పుడితే చిరంజీవి.. ఆయన కుటుంబ సభ్యులు వచ్చి ఇదే హంగామా చేస్తారా.. అని ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. సమాధానం వెతుక్కోవాలి.