Oppenheimer: శృంగార సన్నివేశంలో భగవద్గీత.. వివాదంలో ఓపెన్‌హైమర్

హిందువులు పవిత్రంగా భావించే భగవద్గీతలోని కొన్ని మాటలను ఒక శృంగార సన్నివేశంలో పలికించాడు దర్శకుడు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

  • Written By:
  • Publish Date - July 25, 2023 / 03:40 PM IST

Oppenheimer: హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ రూపొందించిన లేటెస్ట్ ఫిలిం ఓపెన్‌హైమర్. అణుబాంబు సృష్టికర్త ఓపెన్‌హైమర్ జీవితం ఆధారంగా, సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ఇది. ఈ చిత్రం ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలోని ఒక సన్నివేశంపై భారతీయుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హిందువులు పవిత్రంగా భావించే భగవద్గీతలోని కొన్ని మాటలను ఒక శృంగార సన్నివేశంలో పలికించాడు దర్శకుడు.

దీనిపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చివరకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ఈ అంశంపై స్పందించారు. శృంగార సన్నివేశంలో భగవద్గీత చదివించేలా చూపించడం తనను ఆవేదనకు గురి చేసిందని అనురాగ్ ఠాకూర్ అన్నారు. ఈ సన్నివేశాల్ని సెన్సార్ బోర్డ్ కూడా తొలగించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యంతరకరంగా ఉన్న ఈ సన్నివేశాన్ని తొలగించకుండా సినిమాకు సర్టిఫికెట్ ఎలా జారీ చేశారన్నారు. దీనికి బాధ్యులైన సెన్సార్ బోర్డు సభ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అభ్యంతరకర సన్నివేశాలను తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు. ఈ సన్నివేశంపై భారత ప్రభుత్వ సమాచార కమిషనర్ ఉదయ్ మహుర్కర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సన్నివేశాన్ని తొలగించాల్సిందిగా కోరుతూ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్‌కు ఆయన ఒక లేఖ కూడా రాశారు. సేవ్​ కల్చర్​ సేవ్​ ఇండియా అనే ఫౌండేషన్​ కూడా ఈ చిత్రంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఈ చిత్రాన్ని దేశంలో నిషేధించాలని ఆ సంస్థ డిమాండ్ చేసింది. దీనిపై కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అత్యవసరంగా దర్యాప్తు చేపట్టాలని కూడా ఆ సంస్థ కోరింది. నెటిజన్ల నుంచి కూడా ఈ సన్నివేశంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సీన్‌ను హిందూత్వపై దాడిగా కొందరు అభివర్ణిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిషేధించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ అంశంపై స్పందించారు. అమెరికా శాస్త్రవేత్త ఓపెన్‌హైమర్ భగవద్గీత చదివాడని, కానీ, భారతీయుల్లో 0.0000001 శాతం మంది కూడా భగవద్గీత చదివి ఉండరని వర్మ అభిప్రాయపడ్డారు. అయితే, దీనికి నెటిజన్లు వర్మకు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. వివాదం సంగతి ఎలా ఉన్నా.. బాక్సాఫీస్ దగ్గర ఓపెన్‌హైమర్ భారీ కలెక్షన్లు సాధిస్తోంది.