ఆడేది తక్కువ ప్రాపగండ ఎక్కువ:
మీరు ఏదైనా నచ్చిన సినిమా చూడాలంటే వెంటనే చూసేందుకు ప్రయత్నాలు చేసుకోండి. ఎవరైనా ఒక మూవీ బాగుంది అన్నారంటే.. ఆ సినిమాకు మీరు వెళ్లాలనుకుంటే ఇప్పుడే బుకింగ్ చేసుకోండి. కొద్దిపాటి ఆలస్యం చేశారా అంతే.. ఇక ఓటీటీలో వచ్చేంత వరకూ వేచిచూడాల్సిందే. ఇలాంటి పరిస్థితులు ప్రస్తుత కాలంలో నడుస్తున్నాయి. ఇలా ప్రేక్షకులను సినిమా థియేటర్ల వద్దకు రప్పించేందుకు సినిమా పరిశ్రమ తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తుందనుకోండి. ముహూర్తం ప్రారంభించిన మొదలు హాలులో విడుదల అయ్యేవరకూ ఒకరకమైన ప్రచారం చేస్తుంది. ఒకవేళ హాలులో విడుదలైనప్పటికీ విజయోత్సవాల పేరిట ఇంకొంచం ప్రజాదరణ పోందేందుకు రకరకాలా కార్యక్రమాలను చేపడుతోంది. ఇన్నీ చేసినప్పటికీ సినిమా ఆడేది మాత్రం ఇందాక చెప్పినట్లు పక్షం లేదా మాసం రోజులు మాత్రమే.
అందరికీ అవకాశాలు:
ఒక్కసారి 3దశాబ్థాల వెనక్కు వెళ్లి చూస్తే ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, చాలా మంది సినిమాలు సంవత్సరాలకు పైబడి ఆడేవి. కొంచం ముందుకు వస్తే 2000 ఆప్రాంతంలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వీరి సినిమాలు 365 నుంచి 150 రోజుల వరకూ హాల్స్ లో ప్రదర్శింపబడేవి. 2011 తరువాత దీని కాలవ్యవధి పూర్తిగా తగ్గిపోయింది. నవతరం హీరోలు వచ్చేశారు. మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, తరుణ్, ఉదయ్ కిరణ్, నితిన్, సిద్దార్థ, రామ్, నాని ఇలా చాలా మంది సినిమాలు 100 రోజులు వరకూ సినిమా థియేటర్లలో నడిచేవి. మరికాస్త ముందుకు 2020లోకి వచ్చేటప్పటి యువ హీరోలు తేరంగేట్రం చేశారు. ఇందులో దాదాపు కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వారే కావడం విశేషం. రామ్ చరణ్, నాగ చైతన్య, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అఖిల్, నవదీప్, నవీన్ చంద్ర, వరుణ్ సందేశ్ ఇంకా చాల మంది సరికొత్త హీరోలు స్క్రీన్ పైకి వచ్చేశారు.
సరికొత్త ఒరవడి ఇదే:
ఇలా రావడంతో పెట్టుబడే లక్ష్యంగా సినిమాలను నిర్మించడం ప్రారంభించారు. సినిమా హిట్టా ఫట్టా అనేది ఇప్పుడు చూడటం లేదు. కలెక్షన్స్ మీద ఆధారపడి నడుస్తోంది చలనచిత్ర పరిశ్రమ. ఒకప్పుడు 100 సెంటర్స్ 200 డేస్ అనే స్వరం ఇప్పుడు మూగబోయింది. ప్రస్తుతం అంతా షూటింగ్ చేశామా.. సినిమా విడుదలైందా.. కలెక్షన్ ఎంత.. అనేలా కొత్త ఒరవడికి నాంది పలికింది. సినిమా ఎలాగైనా ఉండనీ మొదటి రోజు ఎంత కలెక్షన్ వసూలు చేసింది. రేపు ఎంత వసూలు చేస్తుంది. ఇదే విధంగా వారం కొనసాగుతుందా లేదా అనేలా నూతన అధ్యయనానికి తెరలేపింది. దీని ప్రభావం రాబోయే అన్ని సినిమాల మీద పడుతుంది.
దీనికి కారణం ఏంటో తెలుసా:
అందుకే సినిమా విడుదల చేసేటప్పుడే ఒక ప్రణాళికా బద్దంగా ఒకరి తరువాత ఒకరు విడుదలకు సన్నద్దం అవుతున్నారు. అలాగే మినిమం రాబట్టేలా చాలా సెంటర్ల లో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఒకప్పుడు ఒకటి, రెండూ థియేటర్లలో మాత్రమే సినిమా ఆడేది. అందుకే వివిధ సుదూర ప్రాంతాల నుంచి వచ్చి సినిమా అభిమానులు చిత్రాన్ని చూసి తిరిగి వెళ్ళేవారు. అందుకనే ఎక్కువ కాలం ఆడేందుకు అవకాశం ఉండేది. ఇలా కాకుండా జిల్లా స్థాయిలో సుమారు పదుల సంఖ్యలో సినిమా హాల్స్ కు ప్రింట్ పంపడం ద్వారా ఎక్కడి ప్రజలు అక్కడే సినిమా చూసేందుకు మక్కువ చూసిస్తున్నారు. దీంతో సినిమా ఎక్కువ రోజులు ఆడేందుకు అవకాశం లేకుండా పోయింది. అందుకే సినిమా త్వరగా చూసేందుకు ప్రేక్షకులు అన్ని ప్రాంతాల్లో టికెట్ కొనుక్కొని చూసేస్తున్నారు. ఇలా చేయడం వల్ల థియేటర్ల సంఖ్య పెరిగి ఎక్కువ రోజులు ఒకే హాలులో ఆడే కాలవ్యవధి తగ్గింది. ఇలా చేయడం వల్ల వినోదం ప్రేక్షకునికి మరింత దగ్గర అవుతుంది. అలాగే నిర్మాత డబ్బులు పెడితే పెట్టుబడి తనకు వచ్చేస్తుంది అనే ధైర్యం కూడా ఉంటుంది. అందుకే ఇలాంటి వింత పరిస్థితులకు ఊతం ఇచ్చిందని చెప్పాలి.
T.V.SRIKAR