సినీ ఇండస్ట్రీలో బ్యూటీస్ అంటే అందరికీ మొదట గుర్తొచ్చేఇ కేరళ. అక్కడి నుంచి వచ్చిన హీరోయిన్స్ అంతా దాదాపు అన్ని ఇండస్ట్రీల్లో మంచి పొజిషన్‌లో ఉన్నారు. మాలీవుడ్ నుంచి వచ్చే కథలు కూడా చాలా క్లాసిక్‌గా మంచి కల్ట్ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్నాయి. కానీ కళ్లకు కనిపించే ఈ కలర్ వెనక ఏంతో మంది అమ్మాయిల వేదన ఉంది. ఎవరికీ చెప్పుకోలేని ఆవేదన ఉంది. ఒక్కోసారి ఉప్పు కూడా చక్కెరలాగే కనిపిస్తుంది. మలయాళ సినీ పరిశ్రమ కూడా అచ్చుగుద్దినట్టు ఇంతే. ఏడేళ్ల కిందట 2017లో మలయాళ నటి భావనా మీనన్ పై కొంతమంది దుండగులు కొచ్చి శివార్లలో లైంగిక దాడి చేశారు. ఈ కేసులో సూత్రధారిగా మలయాళ సూపర్ స్టార్ దిలీప్ పేరు రావడంతో సంచలనం రేగింది. ఆ సమయంలో అన్ని విదాలా వచ్చిన ఒత్తిడి మేరకు కేరళ ప్రభుత్వం మలయాళ చిత్ర పరిశ్రమలో స్త్రీల పరిస్థితిని అధ్యయనం చేయడానికి జస్టిస్ హేమా కమిషన్‌ను నియమించింది. మన సీనియర్ నటీమణి శారద కూడా ఈ కమిటీలో ఒక సభ్యురాలు. విచారణ ముగించిన కమిషన్ 2019లో ప్రభుత్వానికి నివేదిక అందించినా అనేక కారణాల వల్ల అది బయటకు రాలేదు. తాజాగా ‘రైట్ టు ఇన్ఫర్మేషన్’ యాక్ట్’ కింద కోరిన వారికి ఆ కమిటీ రిపోర్టు ఇవ్వొచ్చని కేరళ హైకోర్టు తెలిపింది. ఆ రిపోర్టు జర్నలిస్టులకు అందింది. 295 పేజీలతో కమిటీ నివేదికను రూపొందిస్తే.. చాలా సున్నితమైన అంశాలు, వ్యక్తిగత వివరాలు ఉన్న కారణంగా 63 పేజీలను మినహాయించి మిగతా నివేదికను బహిర్గతం చేశారు. కాస్తలో కనుమరుగు కాబోయిన ఈ కమిటీ నివేదిక మళయాల పరిశ్రమలో ఉన్న దరిద్రాన్ని కళ్లకు కట్టినట్టు చూపించింది. ఇండస్ట్రీలో స్త్రీలు పడుతున్న బాధలను అక్షరబద్ధం చేసింది. ఇడస్ట్రీలో ఎదగాలంటే శరీరాలను ఆర్పించుకోవాలి. ఎదురు ప్రశ్నిం చకుండా కోరికలు తీర్చాలి. సహకరించిన వాళ్లకు అవకాశాలు, ఎదురు తిరి గిన వాళ్లకు వేదింపులు. ఇదీ 233 పేజీలతో జస్టిస్ హేమా కమిటీ నివేదిక సారాంశం. బయట శృంగారానికి ఒప్పుకోకపోతే సినిమాలో క్యారెక్టర్‌లో దాన్ని క్రియేట్ చేసి వేధించేవాళ్లని హేమ కమిటీ నివేదించింది. ఇండస్ట్రీలో ఎదగాలంటే కమిట్‌మెంట్ ఇవ్వాల్సిందే అనే భావనను కొత్త యాక్టర్స్‌లో కలుగజేసి వాళ్లను లొంగదీసుకునేవాళ్లట. సినిమాకు ఆ అమ్మాయి అవసరం ఐతే ఓకే.. కానీ అమ్మాయే అవకాశం కోసం వస్తే మాత్రం కోరికలు తీర్చాల్సిందే. ఇదీ కేరళ సినీ ఇండస్ట్రీ పరిస్థితి. 15 మంది మగ మహారాయుళ్లు సినీ ఇండస్ట్రీని చెప్పుచేతల్లో పెట్టుకున్నారని, వాళ్లు చెప్పినట్లే అందరూ నడుచుకుంటున్నారని నివేదిక తేల్చింది. ఈ 15 మందికి సహకరిస్తే ఇండస్ట్రీలో అపారంగా అవకాశాలు లభిస్తాయి. సహకరించని వాళ్ల జీవితాలు నాశనమైపోతాయని చెప్పింది. ఆ 15 మంది పేర్లు బయటకు రావాల్సి ఉంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టాలంటే సర్దుకుపోండి.. రాజీపడండి.. మలయాళ సినీ పరిశ్రమలో అవకాశాల కోసం వచ్చే మహిళలకు పరిశ్రమ పెద్దలు చెప్పే రెండు మాటలు ఇవే. వీటికి సిద్ధపడి జీవితాలను అర్పించుకుంటేనే భారీ పారితోషకాలతో మెండుగా అవకాశాలు కల్పిస్తారు. కాదు.. కూడదని ఎదురు తిరిగితే మాత్రం వాళ్ల జీవితాలను నాశనం చేయడానికి కూడా వెనుకాడరు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కూడా బాధితులు ముందుకు రారంటే వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ నివేదికతో పాటే పరిస్థితిని మార్చేందుకు కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. సినీ పరిశ్రమలో మహిళల సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చట్టాలు చేయాలి. అవసరమైతే ప్రత్యేక ట్రిబ్యున లేను ఏర్పాటు చేసి మహిళలను న్యాయం చేయాలి. నేరచరిత్ర ఉన్న వాళ్లపై సినీ ఇండస్ట్రీ నిషేధం విధించాలి. షూటింగ్ జరిగే ప్రాంతాల్లో మద్యం, మాదకద్రవ్యాలపై నిషేధం విధించాలి. ఫ్యాన్ క్లబ్స్ మహిళలను వేదించ కుండా చర్యలు తీసుకోవాలి. పరిశ్రమలో పనిచేసే మహిళలకు పురుషులతో సమానంగా వేతనాలు అందించాలి. ఇవీ హేమ కమిషన్ చేసిన సిఫార్సులు. ఇప్పుడు ఈ రిపోర్ట్‌పై కేరళ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.