బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ లక్ష్యంగా మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ అక్కినేని కుటుంబానికి, వారి మాజీ కోడలు సమంతాకు తగలడం ఇప్పుడు పెద్ద సంచలనమే అవుతోంది. ఈ వ్యవహారం ఏ మలుపు తిరిగే అవకాశం ఉంది అనే దానిపై చాలానే అంచనాలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో అక్కినేని నాగార్జున ఇప్పటికే పరువు నష్టం దావా కూడా వేసారు. ఇక ఆయన తుమ్మడి కుంట ను కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కట్టారని ఓ కేసు కూడా నమోదు అయింది. ఆ తర్వాత బీసీ మంత్రిపై కేసు వేసారని మరో కేసు పెట్టారు.
ఇలా ఈ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. అయితే అక్కినేని నాగార్జునను కంట్రోల్ చేసేందుకు సిఎం రేవంత్ రెడ్డి కూడా రంగంలోకి దిగారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అక్కినేని కుటుంబం విషయంలో రేవంత్ ముందు నుంచి దూకుడుగానే ఉన్నారు. సురేఖకు గనుక వంద కోట్ల పరువు నష్టం దావా వేస్తే మాత్రం కచ్చితంగా రియాక్ట్ అయ్యేందుకు రేవంత్ రెడ్డి కూడా సిద్దంగానే ఉన్నారు. ఇక నాగార్జునపై మరో కేసు కూడా నమోదు అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ తరుణంలో మరో వార్త బయటకు వస్తోంది.
అక్కినేని కుటుంబం పరువు నష్టం దావా వేస్తే కేసు పెట్టె అవకాశం ఉంది కాబట్టి సమంతాతో పరువు నష్టం వేయించే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. రేపు సమంతా హైదరాబాద్ వస్తోంది. ఈ వ్యవహారం మీదనే ఆమె హైదరాబాద్ లో ల్యాండ్ అవుతున్నారనే టాక్ నడుస్తోంది. అయితే ఆమె రావడానికి అసలు కారణం మాత్రం అలియా భట్ నటించిన జిగ్రా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వస్తున్నారని అంటున్నారు. ఆమె ఈ వేడుకలో సురేఖ వ్యాఖ్యలపై ఏమైనా రియాక్ట్ అవుతారా అనే దానిపై కూడా అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఇప్పటికే సమంతాకు కొండా సురేఖ క్షమాపణలు కూడా చెప్పిన సంగతి తెలిసిందే. తాను కోపంలో అన్నాను అని కూడా వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. అయితే సమంతా పరువు నష్టం వేస్తే మాత్రం కొండా సురేఖ చిక్కుల్లో పడ్డట్టే అవుతోంది. ఇక ఈ వ్యవహారంపై సినిమా వాళ్ళు అందరూ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. అక్కినేని అఖిల్ అయితే ఈ విషయంలో వెనక్కు తగ్గేది లేదు అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. చిరంజీవి నుంచి చిన్న చిన్న నటుల వరకు అందరూ రియాక్ట్ అయ్యారు. మరి ఈ వ్యవహారంలో ఫ్యూచర్ లో ఏ మలుపులు తిరుగుతుందో చూడాలి.