అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏప్రిల్ 5న ‘దేవర’ సినిమా విడుదలై ఉండేది. థియేటర్ల దగ్గర జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల హంగామా ఓ రేంజ్ లో ఉండేది. ఈ పాటికి రివ్యూలు, పబ్లిక్ టాక్ లు వచ్చి.. సినిమా ఎలా ఉందో తెలిసిపోయేది. కానీ దేవర అక్టోబర్ కి వాయిదా పడటంతో ఈ సందడంతా కనపడకుండా పోయింది. అదే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసహనానికి కారణమైంది.
కెరీర్ స్టార్టింగ్ లో వేగంగా సినిమాలు చేసిన ఎన్టీఆర్.. ఈ గత ఆరేళ్లలో మాత్రం ఒకే ఒక్క సినిమాని విడుదల చేశాడంటే ఆశ్చర్యం కలగకమానదు. 2018లో వచ్చిన ‘అరవింద సమేత’ (Aravinda Sametha) తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ (RRR) కోసం ఎక్కువ సమయం కేటాయించాడు ఎన్టీఆర్. ఆ సినిమా 2022 లో విడుదలై, ఎన్టీఆర్ (NTR) కి గ్లోబల్ ఇమేజ్ తీసుకొచ్చినప్పటికీ.. అది మల్టీస్టారర్ కావడంతో ఫ్యాన్స్ పూర్తిస్థాయిలో సంతృప్తి చెందలేదు. ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన సినిమా ఎప్పుడొస్తుందా థియేటర్లలో ఎంత రచ్చ చేయాలా అని ఆరేళ్లుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. వారు తమ ఆశలన్నీ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘దేవర’ (Devara) పైనే పెట్టుకున్నారు. అసలే ఇది.. ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని తీస్తున్న పూర్తిస్థాయి యాక్షన్ ఫిల్మ్ కావడం, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కావడంతో.. ఈసారి ఫైట్లు, మాస్ స్టెప్పులతో థియేటర్లు దద్దరిల్లిపోతాయని ఫ్యాన్స్ భావించారు. కానీ ఈ సినిమా ఆలస్యం.. వారిని ఫ్రస్ట్రేట్ అయ్యేలా చేస్తోంది.
‘ఆర్ఆర్ఆర్’ విడుదలైన తర్వాత కూడా ‘దేవర’ షూటింగ్ స్టార్ట్ చేయడానికి చాలా సమయం తీసుకున్నాడు ఎన్టీఆర్. అయితే లేట్ గా అయినా.. పక్కా ప్లానింగ్ తో షూటింగ్ స్టార్ట్ చేసి, ఏప్రిల్ 5 రిలీజ్ డేట్ అని ప్రకటించడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలయ్యారు. షూటింగ్ వేగంగా జరుగుతుండటం, మూవీ అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు వస్తుండటంతో.. ఫ్యాన్స్ ఆ గ్యాప్ బాధని మర్చిపోయి ‘దేవర’ కోసమే ఎదురుచూస్తూ వచ్చారు. అయితే ఈమధ్య మరో షాక్ ఇచ్చారు మేకర్స్. ‘దేవర’ ను అక్టోబర్ 10కి వాయిదా వేశారు. అప్పటినుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు.
నిజానికి ఏప్రిల్ 5 అనేది చాలా మంచి రిలీజ్ డేట్. ఇతర పెద్ద సినిమాలు లేకపోవడంతో.. ‘దేవర’ సోలోగా రిలీజ్ అయ్యి టాక్ తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ వచ్చేవి. అలాగే ఉగాది, రంజాన్ తో పాటు వేసవి సెలవలు కూడా ఉండటంతో.. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా రికార్డు వసూళ్లు సాధించే అవకాశముండేది. అలాంటి మంచి ఛాన్స్ ని ‘దేవర’ మిస్ చేసుకుంది. మరోవైపు కొత్త విడుదల తేదీ అక్టోబర్ 10 అనేది దసరా సీజన్ కావడంతో.. ఇతర సినిమాల తాకిడితో సోలో రిలీజ్ దొరికే అవకాశంలేదు.
ఓ వైపు ఆలస్యం, మరోవైపు సోలో రిలీజ్ మిస్ కావడంతో.. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ ఫ్రస్ట్రేషన్ ను చూపిస్తున్నారు. ఈ ఏప్రిల్ 5 నే సినిమా రిలీజ్ అయినట్లుగా.. “దేవర మూవీ రివ్యూ” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే “థాంక్స్ ఎన్టీఆర్ అన్న.. ఆరేళ్ళు నుంచి నీ సోలో సినిమా కోసం వెయిట్ చూపిస్తున్నావు” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభిమానుల ఆవేదనలో అర్థముంది. ఎందుకంటే ఒక బిగ్ స్టార్ తన ప్రైమ్ టైంలో ఇన్నేళ్లు సినిమా విడుదల చేయకుండా ఉండటమంటే మామూలు విషయం కాదు. మరి ఈ విషయాన్ని ఇప్పటికైనా ఎన్టీఆర్ గ్రహించి.. మునుపటిలా వేగంగా సినిమాలు చేస్తాడేమో చూడాలి.