ఒక స్టార్ హీరో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే పిచ్చి పీక్స్ లో ఉంటుంది. సినిమా కోసం నాలుగేళ్ల నుంచి ఎదురు చూస్తుంటే ఆ పిచ్చికి లెక్క ఉండదు. సినిమా గురించి ఏ ప్రకటన వచ్చినా, సినిమా గురించి ఏ చిన్న సమాచారం లీక్ అయినా సరే జనాల్లో ఓ రేంజ్ ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు దేవర విషయంలో అలాంటి పరిస్థితి ఉంది. ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ హీరోగా వస్తున్న సినిమా దేవర. ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. విదేశాల్లో సినిమా రికార్డులు చూసి హాలీవుడ్ జనాలు కూడా షాక్ అవుతున్నారు.
సినిమా రిలీజ్ అవకముందే ప్రీ రిలీజ్ మార్కెట్ అమెరికాలో 2 మిలియన్లు జరిగింది. ఇప్పటికే సలార్ రికార్డులు కూడా క్రాస్ అయ్యాయి. సినిమా హిట్ టాక్ వస్తే ఏ రేంజ్ లో వసూళ్లు ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రీ బుకింగ్ మార్కెట్ భారీగా జరుగుతోంది. హిందీలో కూడా భారీగా ఉండే అవకాశం ఉంది. ఒక్క కర్ణాటకలోనే మొదటి రోజు 20 కోట్ల మార్కెట్ జరిగే అవకాశం ఉందని లెక్కలు వేస్తున్నారు. అలాంటి సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ అని ప్రకటించి క్యాన్సిల్ చేస్తే ఏ రేంజ్ లో కోపం ఉంటుంది జనాలకు…?
రెండు రోజుల క్రితం ఈవెంట్ అని చెప్పి ఫ్యాన్స్ ని పిచ్చోళ్ళను చేసారు. దీనితో నోవోటేల్ హోటల్ లో ఫ్యాన్స్ చుక్కలు చూపించారు. దేవర ప్రీ – రిలీజ్ ఈవెంట్ లో ఫ్యాన్స్ చేసిన డ్యామేజ్ అక్షరాలా 33 లక్షలు. మెయిన్ గ్లాస్, ఎలివేటర్ గ్లాస్, కొన్ని డోర్లు, ఎన్నో కుర్చీలు డామేజ్ అయ్యాయి. ఒక్క కుర్చీలకే 7 లక్షల బిల్లు వేసారు హోటల్ సిబ్బంది. 33 లక్షల బిల్లుని కొంతమేర తగ్గించమని శ్రేయాస్ మీడియాను అడుగుతున్నట్టు తెలుస్తోంది. తమ తప్పేమీ లేదని మీరే కావాలని చేసారని తగ్గేది లేదని హోటల్ సిబ్బంది సమాధానం చెప్పారట.