ఇంతా చేస్తే ధనుష్ అంత సులువుగా స్టార్ అవలేదు. ఆయన హీరో అయ్యే ప్రాసెస్‌లో ఎన్నో సినిమా కష్టాలు ఉన్నాయి అని మీకు తెలుసా. అవును ధనుష్ అస్సలు హీరో అవ్వాలనే అనుకోలేదు. ఏదైనా రెస్టారెంట్‌లో చెఫ్ అవుదామని కలలు కన్నాడు. కానీ అయన తండ్రి కస్తూరి రాజా తనని యాక్టర్ అవమని పట్టుపట్టాడు. ఫాదర్ మాట కాదనలేక.. తుల్లువదో ఇలామై చిత్రంలో తొలిసారి నటించాడు ధనుష్. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఐతే హీరో అంతంత మాత్రంగానే ఉన్నాడు.. యాక్టింగ్ కూడా సో సోగా ఉంది అంటూ విమర్శకులు ట్రోల్ చేశారు. ఎవరైనా ఐతే అక్కడితో యాక్టింగ్‌కి గుడ్‌బై చెప్పేసి.. ఏదో ఒక పని చేసుకుని బతికేసేవారు. ధనుష్ అలా చేయలేదు. ఛీ కొట్టిన నోళ్లతోనే జై కొట్టించుకోవాలని ఆ క్షణమే డిసైడ్ అయ్యాడు.
ఆ నెక్స్ట్ అన్న సెల్వ రాఘవన్ డైరెక్షన్‌లో కాదల్ కొండెయిన్ చిత్రం చేశాడు. ఆ సినిమాలో కొన్ని సీన్స్‌లో ధనుష్ యాక్టింగ్ సరిగా చేయకపోతే.. సెల్వ రాఘవన్ కొట్టి మరీ యాక్టింగ్ చేయించాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ధనుష్ యాక్టింగ్ కి విమర్శకుల ప్రసంశలు కూడా అందుకుంది. ఆ తర్వాత నుంచి ధనుష్ అన్ని రకాల జోనర్స్ ట్రై చేస్తూ స్టార్ హీరో అయ్యారు. రీసెంట్‌గా సర్ మూవీతో తెలుగు ఆడియన్స్‌ని డైరెక్ట్‌గా పలకరించి పెద్ద హిట్ అందుకున్నాడు. త్వరలో డైరెక్టర్ శేఖర్ కమ్ములతో కలిసి ఒక పాన్ ఇండియా సినిమాతో సరి కొత్తగా ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు.
ధనుష్ నటన కోలీవుడ్, టాలీవుడ్‌కే కాదు.. బాలీవుడ్‌కి కూడా చేరువయింది. రాంజానా చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ధనుష్.. ఆ తర్వాత.. షమితాబ్, అత్రంగీ సినిమాలు చేసి.. ఫిదా చేశాడు. ఇండియా వైడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న అయన.. హాలీవుడ్ స్క్రీన్ మీద కూడా కన్నేశాడు. ది ఎక్సటార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్ చిత్రంతో ఇంగ్లీష్ ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేసిన ధనుష్.. ఆ తర్వాత ది గ్రే మాన్ చిత్రంతో ఆకట్టుకున్నాడు. ఆడుకాలం, అసురన్ చిత్రాలలో అద్భుతంగా నటించి.. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నారు. నటుడిగా మొదలై.. నిర్మాతగా, సింగర్‌గా కూడా ఫుల్ టూ ఎంటర్టైన్ చేస్తున్నాడు ధనుష్.