Dhanush: తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో నలుగురు స్టార్ హీరోలకు షాకిచ్చింది. నిర్మాతలకు సహకరించలేదనే ఆరోపణలతో రెడ్ కార్డ్ ఇవ్వాలని నిర్ణయించింది. హీరోలు ధనుశ్, శింబు, విశాల్, అధర్వపై తమిళ నిర్మాతల సంఘం నిషేధం విధించింది. ఇకపై వీరు ఏ సినిమాల్లోను నటించకుండా రెడ్ కార్డ్ ఇవ్వనున్నారు. నిర్మాత మైఖేల్ రాయప్పన్‌తో ఏర్పడిన వివాదాలతోనే హీరో శింబుకు రెడ్ కార్డు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఈ వివాదంపై ఇప్పటికే ఎన్నోసార్లు సంప్రదించినా.. ఎలాంటి మార్పు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రొడ్యూసర్ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా వ్యవహరించిన సమయంలో నిధులను విశాల్ దుర్వినియోగం చేశారని ఆరోపణలతో రెడ్ కార్డ్ ఇవ్వనున్నారు. తెనందాల్ నిర్మాణ సంస్థలో ధనుష్ చేసిన సినిమా 80 శాతం షూట్ పూర్తైంది. అయితే, ఆ తర్వాత షూటింగ్‌కు సహకరించకపోవడంతో నిర్మాతకు నష్టం జరిగినట్లు తెలిసింది. అందుకే విశాల్‌పై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. మదియలకన్ నిర్మాణ సంస్థతో అధర్వ ఓ చిత్రానికి ఓకే చేశారని.. అయితే షూటింగ్ సమయంలో సహకరించడం లేదనే ఆరోపణలతో అధర్వకు రెడ్ కార్డ్ ఇవ్వనున్నట్లు సమాచారం. వీరితో పాటు నిర్మాతలకు సహకరించని మరికొందరు నటీనటులకు కూడా రెడ్ కార్డ్ ఇవ్వాలని నిర్మాతల సంఘం కొన్ని నెలల క్రితమే నిర్ణయించింది.
ఇక ఈ జాబితాలో ధనుష్, శింబు, విశాల్, అధర్వతో పాటు.. ఎస్‌జే సూర్య, విజయ్ సేతుపతి, అమలా పాల్, వడివేలు, ఊర్వశి, సోనియా అగర్వాల్ సహా 14మంది నటీనటులు ఉన్నట్లు సమాచారం. మరోవైపు తమిళ చిత్ర పరిశ్రమలోని ప్రధాన సంఘాలైన దక్షిణ భారత నటీనటుల సంఘం, తమిళ చిత్ర నిర్మాతల సంఘం మధ్య ఎలాంటి విభేదాలు లేవు. నటీనటుల కాల్షీట్స్, కొత్త ఒప్పందాలపై నిర్మాతల నుంచి కొన్ని ఫిర్యాదులు అందాయి. అదే విధంగా నటీనటుల వైపు నుంచి కూడా కొన్ని సమస్యలు ప్రస్తావించారు. ఈ భేటీలో నిర్మాతలకు నష్టం కలిగేలా వ్యవహరించినందుకు నలుగురు హీరోలపై చర్యలకు దిగింది. అయితే నలుగురు స్టార్ హీరోలకు రెడ్ కార్డ్‌లు ఇవ్వడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.