Dil Raju: టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇటీవల తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఉత్కంఠగా సాగిన ఎన్నికలో నిర్మాత సి.కళ్యాణ్‌పై దిల్ రాజు ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఫిలిం ఛాంబర్ ఎన్నికలు చాలా సాధరణమైనవని, వీటికి ప్రధాన ఎన్నికలతో కలిపి చూడొద్దని కోరారు. తాను ప్రస్తుతం ఫిలిం ఛాంబర్ ఎన్నికలకే ప్రాధాన్యం ఇస్తున్నానని, తాను గనుక నిజమైన ఎన్నికల్లో పోటీ చేస్తే ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా గెలిచే సత్తా ఉందని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు అటు సినిమా ఇండస్ట్రీలో, ఇటు పొలిటికల్ సర్కిల్‌లో చర్చనీయాంశంగా మారాయి. తెలుగు సినిమా రంగంలో దిల్ రాజు అగ్ర నిర్మాతగా కొనసాగుతున్నారు. సినిమా ఇండస్ట్రీని శాసించగల నిర్మాతల్లో ఒకరు. స్టార్ హీరోలతో సినిమాలు తీస్తున్నారు. నిర్మాతగా సినీ పరిశ్రమలో అగ్రస్థానానికి చేరుకున్నప్పటకీ ఆయనలో రాజకీయపరమైన ఆలోచనలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగి పోటీ చేయాలనుకుంటున్నారని చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని కూడా ప్రచారం జరిగింది. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ నేతలతోనూ సత్సంబంధాలు కలిగి ఉన్నాడు. అయితే, ఏ పార్టీలోనూ అధికారికంగా చేరలేదు. దిల్ రాజు స్వస్థలం తెలంగాణలోని నిజామాబాద్ నర్సింగ్ పల్లి గ్రామం. దీంతో దిల్ రాజు నిజామాబాద్ నుంచి ఎంపీగా లేదా రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించినట్లు తెలుస్తోంది. కానీ, ఈ విషయంలో తొందరపడటం లేదు. ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తను కోరుకున్న స్థానం నుంచి తనకు టిక్కెట్ ఇచ్చే పార్టీ ఏది..? గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి..? ఏ పార్టీ సరైంది..? వంటి అంచనాలు వేస్తున్నారు.
పైగా తన పొలిటికల్ కెరీర్ వల్ల సినిమారంగంలో ఇబ్బందులు తలెత్తకూడదు. అందుకే రాజకీయ రంగ ప్రవేశం విషయంలో జాగ్రత్తగా అడుగులేస్తున్నారు. దిల్ రాజు కోరుకుంటున్న నిజామాబాద్ ఎంపీ స్థానంలో బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ పోటీలో ఉండబోతున్నారు. ప్రస్తుత ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎమ్మెల్యేగా పోటీ చేయనుండగా.. ఆ స్థానానికి బీజేపీ తరఫున పెద్దగా పోటీ లేదు. కానీ, స్థానిక పసుపు రైతుల నుంచి బీజేపీపై వ్యతిరేకత ఉంది. అందువల్ల బీజేపీతో అంత ప్రయోజనం లేదు. ఈ నేపథ్యంలో ఎంపీగా పోటీ చేసే అవకాశాలు తగ్గాయి. మరోవైపు నిజామాబాద్ రూరల్ స్థానం నుంచి కూడా గట్టిపోటీనే ఉంది. అందువల్ల దిల్ రాజ్ రాజకీయ రంగ ప్రవేశం ఆలస్యమవుతోంది. అన్నీ అనుకూలిస్తేనే ఆయన రాజకీయాల్లోకి వస్తారు.